ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేను: ఆసీస్‌ కోచ్‌

24 Dec, 2020 19:14 IST|Sakshi

టీమిండియాపై ఒత్తిడి ఉంది: లాంగర్‌

సిడ్నీ: చెత్త ప్రదరర్శన కారణంగా ప్రత్యర్థి జట్టు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోగలనని, అయితే వారి కోచ్‌ స్థానంలో మాత్రం తనను ఊహించుకోలేనని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి ఉందని, అది తమ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. క్రిస్‌మస్‌ వీకెండ్‌ను తాము సంతోషంగా గడుపుతామని చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పింక్‌ బాల్‌ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆట ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్‌ డిజిట్‌ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడంతో కోహ్లి సేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

అదే విధంగా టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఇందుకు బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలగాలంటూ నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై విమర్శలు గుప్పించారు. కాగా సోని నెట్‌వర్క్‌ నిర్వహించిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న లాంగర్‌కు ఈ అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రవిశాస్త్రి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని అడుగగా.. ‘‘అసలు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ఇప్పటికే నాకున్న ఒత్తిళ్లు చాలు. అయితే వారి బాధను నేను సహానుభూతి చెందగలను. ఇక ఇప్పుడు టీమిండియాపై ఒత్తిడి ఉందనేది వాస్తవం’’ అని పేర్కొన్నాడు. (చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్‌ చేసింది: అక్తర్‌)

వాళ్లిద్దరూ లేకపోవడం మంచిదే
ఇక కోహ్లి, షమీ గైర్హాజరీ తమకు లాభిస్తుందన్న లాంగర్‌.. తదుపరి మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. ‘‘ఏ ఆటలోనైనా స్టార్లు లేకుంటే ప్రత్యర్థి జట్టుకు ఉపయోగకరమే కదా. విరాట్‌ కోహ్లి గొప్ప ఆటగాడు. షమీ కూడా మంచి ప్లేయర్‌. వాళ్లు లేకపోవడం మాకు సానుకూలాంశమే. ఇక రెండో టెస్టులో మొదటి రోజు నుంచే రహానే(తాత్కాలిక కెప్టెన్‌)పై ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు