ఆ స్లో ఓవర్‌రేట్‌ మా కొంపముంచింది: లాంగర్‌

9 Mar, 2021 12:03 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మా కొంపముంచిందంటూ ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో మా బౌలర్లు గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉండగా.. రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దాంతో మాపై స్లో ఓవర్‌ రేట్‌ నమోదైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మేము నాలుగు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పటికీ ఈ విషయంపై మా జట్టు మేనేజర్‌ గెవిన్‌ డెవోయ్‌తో పాటు ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో చర్చించాను. స్లో ఓవర్‌ రేట్‌ వల్ల  పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని.. అది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నా.

ఇదే విషయంలో ఆసీస్‌ బౌలర్లను కూడా హెచ్చరించా. సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో స్లో ఓవర్‌రేట్‌ కాకుండా చూసుకోవాలని తెలిపా. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌ రద్దవడం మాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సిరీస్‌ రద్దు కావడం.. టీమిండియాతో జరిగిన సిరీస్‌ను మేం చేజార్చుకోవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హతకు మరింత దూరం కావాల్సి వచ్చింది. అంటూ తెలిపాడు.

ఇదిలా ఉంచితే.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్‌లో సౌతాంప్టన్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. అయితే డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ 70 శాతంతో రెండో స్థానంలో.. ఆసీస్‌ 69.2 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్‌కు, ఆసీస్‌కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది.  ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం... అనుకున్న సమయానికి ఒక ఓవర్‌ తక్కువ వేస్తే.. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు ఫెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఆ విధంగా ఆసీస్‌ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్‌ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ పాయింట్లు దక్కించుకుంది. 
చదవండి:
'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'

ఆసీస్‌ జట్టులో విభేదాలు.. కారణం అతనే!

మరిన్ని వార్తలు