Jyothi Surekha: సూపర్‌ సురేఖ

26 Sep, 2021 04:29 IST|Sakshi

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు

కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ రికార్డు

అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌íÙప్‌లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ గురి అదిరింది. శనివారం జరిగిన కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ భారత్‌కు మూడు రజత పతకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ విభాగంలో, మహిళల టీమ్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

యాంక్టన్‌ (అమెరికా): అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటుకున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌íÙప్‌లో మెరిసింది. మూడు స్వర్ణ పతకాలపై గురి పెట్టిన సురేఖ కీలకదశలో తడబడి చివరకు మూడు రజత పతకాలతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో సురేఖ రజతం సొంతం చేసుకుంది. సారా లోపెజ్‌ (కొలంబియా)తో జరిగిన ఫైనల్లో సురేఖ 144–146 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

ఇద్దరూ ఐదుసార్లు మూడు బాణాల చొప్పున మొత్తం 15 బాణాలను లక్ష్యంవైపు గురి పెట్టి సంధించారు. తొలి సిరీస్‌లో సారా లోపెజ్‌ 29, సురేఖ 28... రెండో సిరీస్‌లో సారా 29, సురేఖ 29... మూడో సిరీస్‌లో సారా 30, సురేఖ 29... నాలుగో సిరీస్‌లో సారా 29, సురేఖ 28... ఐదో సిరీస్‌లో సారా 29, సురేఖ 30 పాయింట్లు స్కోరు చేశారు. చివరకు రెండు పాయింట్ల తేడాతో సారా లోపెజ్‌ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.  

అంతకుముందు సెమీఫైనల్లో సురేఖ 148–146తో ఆండ్రియా బెసెరా (మెక్సికో)పై, క్వార్టర్‌ ఫైనల్లో 150–144తో అమందా మ్లినారిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించింది. మ్లినారిచ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సురేఖ 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో లిండా అండర్సన్‌ (అమెరికా; 2018లో), సారా లోపెజ్‌ (కొలంబియా; 2013, 2021లో) మాత్రమే 150కి 150 పాయింట్లు స్కోరు చేశారు.  

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్‌ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత జట్టు 224–229 పాయింట్ల తేడాతో సారా లోపెజ్, అలెజాంద్రా ఉస్కియానో, నోరా వాల్దెజ్‌లతో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిõÙక్‌ వర్మ (భారత్‌) జంట ఫైనల్లో 150–154 పాయింట్ల తేడాతో సారా లోపెజ్‌–డానియల్‌ మునోజ్‌ (కొలంబియా) జోడీ చేతిలో పరాజయంపాలైంది.

ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో సురేఖ గెలిచిన పతకాలు. 2017లో టీమ్‌ విభాగంలో రజతం, 2019లో టీమ్‌ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించింది. 2021లో మూడు రజతాలు గెలిచింది.

తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జ్యోతి సురేఖ 41 అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 36 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 16  రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు