‘కామన్వెల్త్‌’కు జ్యోతి

17 Jun, 2022 05:34 IST|Sakshi

బరిలో నీరజ్‌ చోప్రా

37 మందితో భారత జట్టు ప్రకటన 

న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్‌ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్‌ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్‌ మార్క్‌ను అందుకున్న తేజస్విన్‌ శం కర్‌ను ఏఎఫ్‌ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్‌సీఏఏ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీల్లో తేజస్విన్‌ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్‌ సమరివాలా స్పష్టం చేశారు.    
 

మరిన్ని వార్తలు