జ్యోతి ‘రికార్డు’ పరుగు

24 May, 2022 05:55 IST|Sakshi

మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రెండోసారి జాతీయ రికార్డు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుకుంటున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ రెండు వారాల వ్యవధిలో రెండోసారి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్‌లోని లాగ్‌బరవ్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ రేసును 13.11 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈనెల 10న సైప్రస్‌ అంతర్జాతీయ మీట్‌లో 13.23 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జ్యోతి తాజా ప్రదర్శనతో ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌కు కూడా అర్హత సాధించింది. భువనేశ్వర్‌లోని రిలయెన్స్‌ ఫౌండేషన్‌ ఒడిశా అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో జేమ్స్‌ హిలియర్‌ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది.

2002లో అనురాధా బిస్వాల్‌ 13.38 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును గత నెలలో ఫెడరేషన్‌ కప్‌ సందర్భంగా జ్యోతి (13.09 సెకన్లు) సవరించింది. అయితే రేసు జరిగిన సమయంలో మైదానంలో గాలి వేగం నిబంధనలకు లోబడి లేకపోవడంతో భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) జ్యోతి రికార్డును గుర్తించలేదు. 2020లో కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ మీట్‌లో జ్యోతి 13.03 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది. అయితే యూనివర్సిటీ మీట్‌లో జ్యోతికి డోపింగ్‌ టెస్టు చేయకపోవడంతోపాటు ఏఎఫ్‌ఐ సాంకేతిక అధికారులెవరూ హాజరుకాకపోవడంతో అప్పుడు కూడా జ్యోతి రికార్డును గుర్తించలేదు. అయితే మూడో ప్రయత్నంలో జ్యోతి శ్రమ వృథా కాలేదు. సైప్రస్‌ మీట్‌లో జ్యోతి నమోదు చేసిన సమయానికి గుర్తింపు లభించింది. దాంతో 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డు బద్దలయింది.

మరిన్ని వార్తలు