రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి

9 Nov, 2023 01:24 IST|Sakshi

బ్యాంకాక్‌: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్‌ జౌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌తో సురేఖ ఆడుతుంది.

రెండో సెమీఫైనల్లో పర్ణీత్‌ కౌర్‌ 147–145తో విక్టోరియా లియాన్‌ (కజకిస్తాన్‌)ను ఓడించింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్‌ అదితి స్వామి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్‌ (బంగ్లాదేశ్‌) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్‌లాండ్‌ జట్టును ఓడించింది.

నేడు జరిగే ఫైనల్లో చైనీస్‌ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిõÙక్‌ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. 

మరిన్ని వార్తలు