Indian Captain: నేనే చీఫ్‌ సెలక్టర్‌ అయితే! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు.. మరికొంత మంది హుడాలు

14 Nov, 2022 19:26 IST|Sakshi

T20 World Cup 2024- Team India Captain: భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్‌-2022 బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లోనే ఇంటి బాటపట్టి అభిమానులను నిరాశపరిచింది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. పటిష్టమైన జట్టుగా నంబర్‌ 1 ర్యాంకులో కొనసాగుతున్న భారత్‌కు ఇలాంటి పరాభవం ఎదురుకావడాన్ని ఫ్యాన్స్‌ సహా మాజీ ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత, జట్టు కూర్పు గురించి పలువురు సూచనలు చేస్తున్నారు. 

ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు అంశం గురించి బీసీసీఐ సీరియస్‌గా ఆలోచించాలని సూచిస్తున్నారు. రోహిత్‌ శర్మను పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కొత్త నాయకుడిని సిద్ధం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షో మ్యాచ్‌ పాయింట్‌లో ఈ మేరకు చిక్కా మాట్లాడాడు.


శ్రీకాంత్‌- ఇర్ఫాన్‌ పఠాన్‌

నేనే గనుక సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అయితే
‘‘ఒకవేళ నేనే గనుక సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అయితే 2024 వరల్డ్‌కప్‌ నాటికి హార్దిక్‌ పాండ్యా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉండేలా చేస్తాను. ఈరోజు నుంచే జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తా. న్యూజిలాండ్‌ పర్యటన నుంచి సన్నాహకాలు మొదలుపెడతా. నిజానికి ప్రపంచకప్‌ టోర్నీకి రెండేళ్ల ముందు నుంచే అన్ని రకాలుగా జట్టును సిద్ధం చేసుకోవడం ఉత్తమం కదా!

ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఏడాది పాటు ప్రయోగాలు చేయండి. దీంతో 2023 నాటికి ఓ అవగాహన వస్తుంది’’ అని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ శ్రీకాంత్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు
ఇక జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘1983, 2011, 2007లో ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు! జట్టులో ఫాస్ట్‌బాల్‌ ఆల్‌రౌండర్లు ఉండాలి. గతంలో ఉన్నారు కూడా! వాళ్లతో పాటు సెమీ ఆల్‌రౌండర్లు కూడా అవసరం. మనకు ఒక్క హుడా సరిపోడు.. చాలా మంది కావాలి’’అని ఈ మాజీ సారథి అన్నాడు.

ఒకరు కాదు ఇద్దరు కావాలి
ఇక శ్రీకాంత్‌ అభిప్రాయంపై స్పందించిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. ‘‘హార్దిక్‌ పాండ్యా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. తనకు గాయాల బెడద కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందే మీ ఈ నాయకుడు గాయపడితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కడు కాదు ఇద్దరు సారథులు కావాలి.

ఒకరు అందుబాటులో లేకపోయినా వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు సిద్ధంగా ఉండాలి. అందుకోసం మరో కెప్టెన్‌ను కూడా సిద్దం చేసుకోవాలి. అలాగే ఓపెనింగ్‌ జోడీలకు కూడా సరైన ప్రత్యామ్నాయాలు వెదకాలి’’ అని పేర్కొన్నాడు.

చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌! ‘ఆర్నెళ్ల పాటు..!’
India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, ఇతర వివరాలు

మరిన్ని వార్తలు