కబడ్డీ కోచ్‌పై జాతీయ క్రీడాకారిణి ఫిర్యాదు

7 Feb, 2023 16:37 IST|Sakshi

శిష్యరికం చేసిన అమ్మాయిని తీర్చిదిద్దవలసిన బృహత్తర బాధ్యత కలిగిన ఓ కామంధ కోచ్‌, ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేసిన ఉదంతం న్యూఢిల్లీలోని బాబా హరిదాస్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కామాంధ కోచ్‌ సదరు యువతిని బలవంతంగా లోబర్చుకుని బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో పాటు తనతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలను భర్త చూపిస్తానని బెదిరించి 43.5 లక్షలు కాజేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కామంధ కోచ్‌పై కేసు రిజిస్టర్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని విచారిస్తామని పేర్కొన్నారు.

నిందితుడితో 2012లో పరిచయం ఏర్పడిందని, జాతీయ క్రీడలకు ప్రిపేర్‌ అయ్యే క్రమంలో తాను కోచింగ్‌ అకాడమీ చేరానని, 2015లో కోచ్‌ తనను బలవంత పెట్టి లోబర్చుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. కోచ్‌ 2018లో తాను సంపాదించిన మొత్తంలో వాటా ఇవ్వాలని బెదిరించాడని, ఆ సమయంలో తాను దాదాపు అర కోటి వరకు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసానని బాధితురాలు తెలిపింది. 2021లో తనకు వివాహం అయ్యాక కోచ్‌ బెదిరింపులు పతాక స్థాయికి చేరాయని, అతను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో గడిపిన ప్రైవేట్‌ ఫోటోలను భర్తకు చూపిస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

బాబా హరిదాస్‌ నగర్‌ పోలీసులు బాధితురాలి పేరును కానీ నిందితుడి పేరును కానీ బహిర్గతం చేయలేదు. కాగా, ఇటీవలికాలంలో కోచ్‌లు తమ వద్ద శిష్యరికం చేసే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఎక్కువై పోయాయి. గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న యువతులకు కల్లబొల్లి మాటలు చెప్పి లోబర్చుకుని బ్లాక్‌ మెయిల్‌ చేయడం, డబ్బులు డిమాండ్‌ చేయడం​ లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు,సామాన్య ప్రజలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు