AIFF: బైచుంగ్‌ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా కళ్యాణ్‌ చౌబే

2 Sep, 2022 15:41 IST|Sakshi
Photo Credit: AIFF Twitter

అఖిల భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య (ఏఐఎఫ్ఎఫ్‌) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు.. బీజేపీ నేత క‌ళ్యాణ్ చౌబే ఎన్నిక‌య్యాడు. టీమిండియా మాజీ ఫుట్‌బాల్‌ స్టార్‌ బైచుంగ్ భుటియాతో జరిగిన పోటీలో 33-1 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం 34 ఓట్లలో భుటియాకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. కాగా 34 స‌భ్యుల ఓట‌ర్ల జాబితాలో భూటియాకు మ‌ద్దతుదారులు క‌రువ‌య్యారు. 85 ఏళ్ల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య చరిత్రలో ఒక మాజీ ఆటగాడు అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇదే తొలిసారి.

ఇక మాజీ ప్లేయ‌ర్ అయిన చౌబే గ‌తంలో మోహ‌న్ బ‌గాన్‌, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే చౌబే ఇండియా సీనియ‌ర్ జ‌ట్టుకు ఎప్పుడూ ఆడింది లేదు. కానీ ప‌లుమార్లు జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. ఇండియా త‌ర‌పున ఏజ్ గ్రూపు ఇంట‌ర్నేష‌నల్ టోర్నీల్లో మాత్రం అత‌ను ప్రాతినిధ్యం వ‌హించాడు. తన ప్రత్యర్థి ఉన్న భూటియాతో కలిసి చౌబే గతంలో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుకు క‌లిసి ఆడాడు.

ఏఐఎఫ్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడి పోస్టుకు క‌ర్నాట‌క ఫుట్‌బాల్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా ఎన్.ఏ హ‌రిస్ గెలుపొందాడు. రాజస్థాన్‌కు చెందిన మ‌న్వేంద‌ర్ సింగ్‌పై హరిస్‌ విజ‌యం సాధించాడు.అలాగే ట్రెజ‌రరీ పోస్టును అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు చెందిన కిపాఅజ‌య్ దక్కించుకున్నాడు. ఇక చౌబే గ‌త పార్లమెంట్‌ ఎన్నిక‌ల్లో బీజేపీ తరపున బెంగాల్‌లోని కృష్ణాన‌గ‌ర్ సీటు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాడు.

కాగా ఆగస్టు 17న ఏఐఎఫ్‌ఎఫ్‌లో తృతీయ పక్షం జోక్యం సహించేది లేదని 'ఫిఫా' పలుమార్లు హెచ్చరించినప్పటికి అఖిల భారత సమాఖ్య ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ పట్టించుకోలేదు. దీంతో ఫిఫా భారత్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తేనే నిషేధం ఎత్తివేస్తామని ఫిఫా తెలిపింది. కాగా భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఆగస్టు 27న ఎత్తివేసింది. 

ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్‌ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏఐఎఫ్‌ఎఎఫ్‌లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు