రాహుల్‌ ఎవరి మాట వినడా.. అంతేనా?

11 Oct, 2020 17:54 IST|Sakshi

దుబాయ్‌: ప్రపంచ క్రికెట్‌లో ఇటీవల కాలంలో క్రికెటర్ల ట్రేడ్‌ మార్క్‌ స్టైల్‌ అనేది అభిమానుల్ని ఎక్కువగా అలరిస్తోంది. ఆటతో పాటు ట్రేడ్‌ మార్క్‌ స్టైల్‌తో ముందుకు సాగుతున్నారు పలువురు క్రికెటర్లు. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్లు అయితే ఈ విషయంలో యూనిక్ స్టైల్‌ను ఫాలో అవుతారు. ఒకరు గంగ్నమ్ డ్యాన్స్ చేస్తే.. మరొకరు సెల్యూట్ చేస్తుంటారు. మరొకరు నోట్ బుక్‌ స్టైల్‌ను ఫాలో అవుతారు. ఇక బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేసిన తర్వాత తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటారు. టీమిండియా క్రికెట్‌లో ఆకాశం వైపు చూస్తే, మరికొందరూ తమ ప్రియసఖిలకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తుంటారు. వీరిలో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ది కూడా ప్రత్యేక మైన స్టైల్‌.(ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్‌: దినేశ్‌ కార్తీక్‌)

రెండు చేతులతో చెవులను మూసుకొని, కళ్లూ మూసుకొని సెలెబ్రేట్ చేసుకుంటాడు.  కేఎల్ రాహుల్‌ గత ఏడాదిన్నరగా ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా గత నెల 24వ తేదీన  రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్(132 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తయిన తర్వాత కూడా తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు, కామెంటేటర్లు ఈ సెలెబ్రేషన్‌కు అర్థం ఏంటనీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మీడియా కూడా ఈ విషయాన్ని రాహుల్ ముందు ప్రస్తావించింది. కానీ అతను మాత్రం కారణం వెల్లడించలేదు.

అయితే దీనికి అర్థం చేసుకోవడానికి టీమిండియా మాజీ క్రికెటర్‌, తెలుగు కామెంటేటర్‌ వేణుగోపాల్‌ రావు.. రాహుల్‌ సెలబ్రేషన్‌ స్టైల్‌ వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి యత్నించాడు. సోషల్‌ మీడియా వేదిక అభిమానులను ప్రశ్నించాడు. కానీ ఫలితం రాలేదు. కాగా, తన సహచర కామెంటేటర్‌ కల్యాణ్ కృష్ణ ఈ ట్రేడ్ మార్క్ స్టైల్ వేనుకున్న కారణం తెలుసుకున్నాడు. కర్ణాటక కామెంటేటర్ విజయ్ భరద్వాజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని కల్యాణ్ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కల్యాణ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘నేను ఎవరి మాట వినను.. ఏం చేయాలనుకుంటానో అది చేసి చూపిస్తాను' అనేదే కేఎల్ రాహుల్ ట్రేడ్ మార్క్ స్టైల్‌కు అర్థమని చెప్పాడు. మరి కేఎల్‌ రాహుల్‌ ఎవరి మాటా వినడా.. ఏం చేయాలో అది చేస్తాడా? అంతేనా అని అనుకోవడం ఫ్యాన్స్‌ వంతైంది. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు