Kamran Akmal: అలా సెలెక్టర్‌ అయ్యాడో లేదో రిటైర్మెంట్‌ ఇచ్చాడు

8 Feb, 2023 10:18 IST|Sakshi

పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ క్రమాన్‌ అక్మల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.  ఇటీవలే పాకిస్తాన్‌ క్రికెట్‌ జాతీయ సెలెక్షన్‌ కమిటీకి ఎంపికైన కమ్రాన్‌ అక్మల్‌ తాజాగా రిటైర్మెంట్‌ ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక పీఎస్‌ఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించిన పెషావర్‌ జాల్మీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక కమ్రాన్‌ అక్మల్‌ 2002లో పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

15 ఏళ్ల పాటు పాక్‌ జట్టు తరపున ఆడిన కమ్రాన్‌ ఫ్రంట్‌లైన్‌ వికెట్‌ కీపర్‌గా పనిచేశాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌ తరపున 157 వన్డేల్లో 3236 పరుగులు, 53 టెస్టుల్లో 2648 పరుగులు, 58 టి20ల్లో 987 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో ఐదు సెంచరీలు, టెస్టుల్లో ఆరు సెంచరీలు బాదాడు. 2009లో టి20 ప్రపంచకప్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టులో కమ్రాన్‌ అక్మల్‌ సభ్యుడిగా ఉన్నాడు.

2010లో పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. కొన్ని రోజుల్లోనే స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం ఆరోపణలు రావడంతో వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పించారు. అలా రెండేళ్ల పాటు ఆటకు దూరమైన కమ్రాన్‌ అక్మల్‌ తిరిగి 2012లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు దూసుకురావడంతో కమ్రాన్‌కు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌ కమ్రాన్‌ అక్మల్‌కు చివరిది. 

ఇక ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌లో కమ్రాన్‌ అక్మల్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు. ఇక పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో 2016 నుంచి 2022 వరకు పెషావర్‌ జాల్మీ తరపున ప్రాతినిధ్యం వహించిన కమ్రాన్‌ 2017 సీజన్‌లో లీగ్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ సీజన్‌లో కమ్రాన్‌ అక్మల్‌ నుంచి మంచి ప్రదర్శన రాగా.. జట్టు కూడా ఫైనల్‌ వరకు వెళ్లగలిగింది. 

చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు