IPL 2022: 'మా కెప్టెన్‌ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్‌ నుంచి దింపేశాడు'

26 Mar, 2022 16:58 IST|Sakshi

మరికొద్ది గంటల్లో ఐపీఎల్‌ 2022 షురూ కానుంది. ఈసారి కూడా ప్రారంభ వేడుకలు లేకుండానే సీజన్‌ ఆరంభం కానుంది. ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ మనకు భౌతికంగా దూరమైనప్పటికి అతని జ్ఞాపకాలు మాత్రం చాలానే ఉన్నాయి. మార్చి 30న మెల్‌బోర్న్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్‌ అంత్యక్రియలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాంటి వార్న్‌కు ఐపీఎల్‌తోనూ విడదీయరాని అనుబంధం ఉంది.

2008లో ప్రారంభమైన ఐపీఎల్‌ సీజన్‌లో తొలి విన్నర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షేన్‌ వార్న్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అండర్‌డాగ్స్‌గా కనిపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చాంపియన్‌గా అవతరించింది. వార్న్‌ తన కెప్టెన్సీతో పెద్దన్న పాత్ర పోషించగా రవీంద్ర జడేజా, షేన్‌ వాట్సన్‌, యూసఫ్‌ పఠాన్‌, అజింక్యా రహానే, అప్పటి పాక్‌ బౌలర్‌ సోహైల్‌ తన్వీర్‌,  కమ్రాన్‌ అక్మల్‌ లాంటి ఆటగాళ్లు మ్యాచ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 

తాజాగా పాక్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యూసఫ్‌ పఠాన్‌, జడేజా, వార్న్‌ల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వివరించాడు. ''మ్యాచ్‌కు ముందురోజు ప్రాక్టీస్‌ చేయడానికి మేం స్టేడియానికి వెళ్లాం. ఆరోజు యూసఫ్‌ పఠాన్‌, జడేజాలు ట్రెయినింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి నేను కూడా లేటుగానే వచ్చాను. కానీ వార్న్‌ మా ముగ్గురిని ఒక్క మాట అనలేదు.. క్లాస్‌ పీకుతాడేమోనని భయపడ్డాం. అయితే ప్రాక్టీస్‌ ముగించుకొని హోటల్‌ రూమ్‌కు బస్సులో బయలేదేరాం. కొద్దిదూరం వెళ్లాకా వార్న్‌ బస్సు డ్రైవర్‌తో బస్సు ఆపండి అన్నాడు. ఆ తర్వాత జడేజా, పఠాన్‌ల వైపు తిరిగి మీరిద్దరు ఇక్కడ దిగి హోటల్‌ రూమ్‌ వరకు నడుచుకుంటూ రండి అని చెప్పాడు. అంతే పఠాన్‌, జడేజా ముఖాలు వాడిపోయాయి.  వార్న్‌  సైలెంట్‌గా పనిష్మెంట్‌ ఇస్తాడని ఆ క్షణమే మనసులో అనుకున్నా. ఆ సందర్బం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది.'' అంటూ పేర్కొన్నాడు. 

ఇక 2008 మినహా మరోసారి టైటిల్‌ గెలవని రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి కప్‌ కొట్టాలనే కసితో ఉంది. అందుకు తగ్గట్లే.. మెగావేలంలో అశ్విన్‌, చహల్‌, హెట్‌మైర్‌, జేమ్స్‌ నీషమ్‌ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా ఈసారి కప్‌ సాధించాలనే పట్టదలతో ఉన్నాడు. మార్చి 29న ఎస్‌ఆర్‌హెచ్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: IPL 2022: టోక్యో ఒలింపిక్స్‌ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ

CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..!

మరిన్ని వార్తలు