కేన్‌ విలియమ్సన్‌ వచ్చేశాడు..

29 Sep, 2020 19:09 IST|Sakshi

సన్‌రైజర్స్‌ ఈసారైనా..

అబుదాబి:  ఈ ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఢీలా పడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఖాతా తెరవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆర్సీబీ, కేకేఆర్‌ చేతిల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌.. మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి తీరాలనే ధృడ సంకల్పంతో ఉంది.  ఈ మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులోకి రావడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ బలం పెరిగింది. సన్‌రైజర్స్‌ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌  తొడకండరాల గాయంతో ఆడలేకపోవడంతో సన్‌రైజర్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు విలియమ్సన్‌ తుది జట్టులోకి రావడంతో సన్‌రైజర్స్‌  గంపెడు ఆశలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. నబీ స్థానంలో విలియమ్సన్‌ జట్టులోకి రాగా, సాహా స్థానంలో సామద్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులతో ఎస్‌ఆర్‌హెచ్‌ పోరుకు సిద్ధమైంది. ఇక ఢిల్లీ తుది జట్టులోకి ఇషాంత్‌ శర్మ వచ్చాడు. అవేశ్‌ ఖాన్‌ స్థానంలో ఇషాంత్‌ బరిలోకి దిగుతున్నాడు.

టాస్‌ గెలిచిన ఢిల్లీ
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించింది. కింగ్స్‌ పంజాబ్‌తో  మ్యాచ్‌లో పోరాడి గెలిచిన ఢిల్లీ.. ఆపై సీఎస్‌కేతో మ్యాచ్‌లో కూడా విజయకేతనం ఎగురవేసింది. దాంతో ఢిల్లీని ఎదుర్కోవడం సన్‌రైజర్స్‌కు సవాలే. పూర్తిస్థాయి బ్యాటింగ్‌లో ఆకట్టుకుని, బౌలింగ్‌లో కూడా రాణిస్తేనే ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ 9..  ఢిల్లీ 6
ఓవరాల్‌ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌-ఢిల్లీల మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ వార్నర్‌ గ్యాంగ్‌దే పైచేయిగా ఉంది. దాన్నే కొనసాగించాలంటే మాత్రం జూలు విదిల్చాల్సి ఉంది. ఇక ఢిల్లీ తరఫున వంద వికెట్ల క్లబ్‌లో చేరడానికి స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 97 వికెట్లు సాధించిన అమిత్‌ మిశ్రా మరో మూడు వికెట్లు తీస్తే డీసీ తరఫున వంద వికెట్ల మార్కును చేరతాడు. మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డు బాలేదు. గతంలో ఢిల్లీపై ఆడిన మ్యాచ్‌లో 43 పరుగులిచ్చాడు. ఇది ఏ ఫ్రాంచైజీ పరంగా చూసినా భువీ చెత్త రికార్డు. 

ఎస్‌ఆర్‌హెచ్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాం గార్గ్‌, అబ్దుల్‌ సామద్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా, కగిసో రబడా, ఇషాంత్‌ శర్మ, అన్రిచ్‌ నోర్త్‌జే

Poll
Loading...
మరిన్ని వార్తలు