దుమ్మురేపిన విలియమ్సన్‌‌, రహానే

31 Dec, 2020 15:25 IST|Sakshi

దుబాయ్‌ : ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌‌‌ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో సెంచరీతో మెరిసిన విలియమ్సన్‌‌‌ టెస్టుల్లో 890 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించాడు. రెండు వారాల క్రితం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా వెలువడిన ర్యాంకింగ్స్‌లో విలియమ్సన్‌‌ వీరిద్దరిని పక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న విలియమ్సన్‌‌కు, రెండో స్థానంలో ఉన్న కోహ్లి మధ్య 11 పాయింట్ల వ్యత్యాసం ఉంది. (చదవండి : రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి)

కాగా టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న స్మిత్‌ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. తొలి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన కోహ్లి 879 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా కోహ్లి గైర్హాజరీలో మెల్‌బోర్న్‌ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానే  సెంచరీతో రాణించి మ్యాచ​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో రహానే ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 10వ స్థానంలో నిలిచాడు.

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మరో ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌ 5వ స్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అశ్విన్‌ రెండు స్థానాలు ఎగబాకి 793 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. భారత్‌ స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.

>
మరిన్ని వార్తలు