కేన్ విలియమ్సన్‌ మోచేతికి గాయం.. కివీస్‌లో కలవరం

9 Jun, 2021 10:40 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఆఖరిరోజు అతని ఎడమ మోచేతికి గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. కానీ కేన్‌ గాయం కివీస్‌ను కలవరానికి గురిచేస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. టీమిండియాతో మరో 9 రోజుల్లో ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటని కివీస్‌ ఆలోచనలో పడింది.

ఇదే విషయమై కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్పందించాడు.'' కేన్‌ మోచేతి గాయంలో పెద్దగా తీవ్రత లేదు. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు కేన్‌ ఆడుతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. అతని పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటాం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా తొమ్మిది రోజులు సమయం ఉండడంతో విలియమ్సన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ సమయానికి అతను పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన మిచెల్‌ సాంట్నర్‌ ఎడమ చూపుడువేలుకు గాయం కావడంతో రెండో టెస్టు ఆడడం లేదు.. అతని స్థానంలో బౌల్ట్‌ తుది జట్టులోకి రానున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుత ప్రదర్శన నమోదు చేసినా.. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కివీస్‌ ఓపెనర్‌ డెవన్‌ కాన్వే సూపర్‌ సెంచరీ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు తన సత్తా ఏంటో చూపించాడు. అయితే కేన్‌ విలియమ్సన్‌ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్‌ రన్‌కే అవుటయ్యాడు. కాగా కేన్‌  రెండుసార్లు జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్‌ 10న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మొదలుకానుంది. ఇక ప్రతిష్టాత్మక​ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టీమిండియా, కివీస్‌ల మధ్య జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరగనుంది.
చదవండి: WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా

WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్‌లో

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు