NZ Vs SL: రీల్‌లైఫ్‌లో హీరో నాని.. రియల్‌ లైఫ్‌లో కేన్‌ మామ; సేమ్‌సీన్‌ రిపీట్‌

14 Mar, 2023 16:40 IST|Sakshi

శ్రీలంక, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్‌లో మ్యాచ్‌ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్‌.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 

70వ ఓవర్‌.. క్రీజులో కేన్‌ విలియమ్సన్‌, మ్యాట్‌ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు..  అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్‌.. బౌలర్‌ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్‌ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్‌. క్రీజులోకి నీల్‌ వాగ్నర్‌.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్‌ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. 

న్యూజిలాండ్‌ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్‌.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్‌.. షాట్‌ ఆడేందుకు కేన్‌ విలియమ్సన్‌ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్‌.. సింగిల్‌ తీసేందుకు కేన్‌ మామ క్రీజు వీడాడు.

ఆలోపే బంతిని అందుకున్న వికెట్‌ కీపర్‌ డిక్‌విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్‌ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్‌ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్‌ ఎంపైర్‌ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్‌ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్‌ నుంచి తప్పించుకొని కేన్‌ మామ హీరోగా నిలిచాడు.

ఇదంతా రియల్‌ లైఫ్‌ మ్యాచ్‌లో జరిగింది. అయితే ఇది సీన్‌ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్‌లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్‌ మామ ఇన్నింగ్స్‌ను తలపించింది.

రియల్‌ లైఫ్‌ మ్యాచ్‌ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్‌ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు.  ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్‌ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్‌ తన బ్యాట్‌ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్‌ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

A post shared by TwEETA PORADU (@tweetaporadu)

చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా'

NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్‌ అత్యంత అరుదైన రికార్డు!

మరిన్ని వార్తలు