Kane Williamson Century: మాట నిలబెట్టుకున్న కేన్‌ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర

28 Dec, 2022 18:20 IST|Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కేన్‌ మామ 206 బంతుల్లో శతకం మార్కును అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. దీంతో 722 రోజుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

విలియమ్సన్‌ బ్యాట్‌ నుంచి ఆఖరిసారి 2021 జనవరిలో సెంచరీ వచ్చింది. అప్పటినుంచి శతకం అనేది అందని ద్రాక్షలా మారింది. ఈలోగా కెప్టెన్సీ బాధ్యతలతో సతమతమవడం అతని బ్యాటింగ్‌ లయను దెబ్బతీసింది. దీంతో కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అలా పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో కచ్చితంగా సెంచరీ చేస్తానని పేర్కొన్నాడు. తాజా శతకంతో ఇచ్చిన మాటను కేన్‌ మామ సగర్వంగా నిలబెట్టుకున్నాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ టెస్టు కెరీర్‌లో ఇది 25వ శతకం కావడం విశేషం. 

ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిక్యంలోకి వచ్చింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌(105 బ్యాటింగ్‌), ఇష్‌ సోదీ(1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్‌ రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజం, అగా సల్మాన్‌లు సెంచరీలతో కథం తొక్కారు.

చదవండి: క్రికెట్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహ్మద్‌ రిజ్వాన్‌.. 

సిరీస్‌ ఓటమిపై ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా

మరిన్ని వార్తలు