IND vs AUS: కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్‌ కెప్టెన్‌ చేసి ఉంటేనా.. వెంటనే!

20 Feb, 2023 17:06 IST|Sakshi

ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో పర్వాలేదనిపించిన ఆసీస్‌.. భారత స్పిన్నర్ల దాటికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం పేకమేడలా కూలిపోయింది. కేవలం 113 పరుగులకే ఆసీస్‌ చాపచుట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్ ఆటతీరుపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

కాగా ఆసీస్‌ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కమిన్స్‌.. తొలి బంతికే స్లాగ్‌స్వీప్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. అయితే అటువంటి సమయంలో కమ్మిన్స్‌ మరింత బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి ఉండాల్సిందని కనేరియా చురకలు అంటించాడు.

ఈ నేపథ్యంలో కనేరియా యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.."స్పిన్నర్లకు ఎలా ఆడాలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు తెలియడం లేదు. అందుకే వారంతా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఇదే రిపీట్‌ అయ్యింది.

ముఖ్యంగా రెండో టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్‌ ఆడిన తీరు మాత్రం నన్ను పూర్తిగా నిరాశపరిచింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు అనవసర షాట్‌ ఆడి వికెట్‌ను కోల్పోయాడు. కమ్మిన్స్‌కు క్రీజులోకి వచ్చే ముందే బంతి బాగా టర్న్‌ అవుతోంది అని పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ కూడా చెప్పాడు. అయినప్పటికీ కమ్మిన్స్‌ స్లాగ్‌స్వీప్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు.

అదే భారత కెప్టెన్‌ గానీ పాకిస్తాన్‌ కెప్టెన్‌గానీ అలా చేసివుంటే.. ఆ తర్వాతి రోజే ఇంటికి పంపేంచేవారు. ఇక రెండో టెస్టు సగం వరకు భారత్‌పై ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది. కానీ భారత స్పిన్నర్లు ఒక్క సారిగా మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసారు. అయితే ఈ ఓటమి మాత్రం ఆస్ట్రేలియా జట్టు ఎప్పటికీ మర్చిపోదాని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! అలా చేసి ఉంటే?

మరిన్ని వార్తలు