Danish Kaneria: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు

24 Nov, 2022 14:21 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌ 2022లో ఘోర పరాభవం తర్వాత.. భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్‌లు పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

భారత టీ20 జట్టులోకి వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్‌ చహర్‌ను తీసుకురావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. చాహర్‌ గాయాలతో బాధపడుతున్నప్పటికీ భువీ కంటే మెరుగైన ఆటగాడు అని అతడు తెలిపాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన భువీకి వన్డే సిరీస్‌కు సెలక​‍్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న దీపక్‌ చహర్‌ వన్డే సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చాడు.

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే ఆక్లాండ్‌ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ క్రమంలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో కనేరియామాట్లాడూతూ... "దీపక్‌ చాహర్‌ అద్భుతమైన ఫాస్ట్‌ బౌలర్‌. అతడిని భారత జట్టు పూర్తి స్థాయిలో  ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చాహర్‌ని తీసుకోవాలి.

అతడు భువీ కంటే అద్భుతంగా రాణించగలడు. అతడు పవర్‌ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తాడు. మీకు నాలుగు ఓవర్లలో 35 నుంచి 40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువీకి గుడ్‌బై చెప్పే సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్‌ వంటి పేస్‌ బౌలర్లు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్‌ సమయానికి భువీ ఫిట్‌గా ఉండడానికి మనకు తెలుసు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం"అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్‌ కార్తీక్‌ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్‌ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్‌

మరిన్ని వార్తలు