క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు..

18 Jun, 2021 20:04 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్‌ 18, 1983) భారత క్రికెట్‌ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్‌లో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి ఆ ఇన్నింగ్సే నాంది పలికింది. 1983 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా  భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటి జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేశ్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన కపిల్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.  

ప్రపంచకప్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 17 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గవాస్కర్‌, శ్రీకాంత్‌, అమర్‌నాథ్‌ లాంటి స్టార్లు సింగల్‌ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. దీంతో ప్రపంచ కప్‌లో భారత్‌ కథ ముగిసిందని అంతా అనుకున్నారు.  ఆర్గనైజర్స్‌ అయితే మరో మ్యాచ్‌ నిర్వహించవచ్చని టాస్‌ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అప్పుడే వచ్చాడు టార్చ్‌ బేరర్‌ కపిల్‌ దేవ్‌. తన సారథ్యంలో భారత్‌ను ఎలాగైనా విశ్వవిజేతగా నిలపాలనుకున్న ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన ఆయన.. ఓవైపు వికెట్లు పడుతున్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్‌మెన్లు బంతిని బ్యాట్‌కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్‌లో అలవోకగా షాట్లు కొడుతూ చెలరేగిపోయాడు. కపిల్ విధ్వంసంతో భారత్‌ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.

అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను.. ఆల్‌రౌండర్‌ కెవిన్‌ కర్రన్‌ (73) ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 235 పరుగలకు ఆలౌట్‌ కావడంతో, భారత్‌ ఓడాల్సిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్‌ బంతితో కూడా రాణించి 11 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. భారత బౌలర్లలో మదన్‌లాల్‌ 3, రోజర్ బిన్నీ 2, సంధూ, అమర్‌నాథ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపు ఇచ్చిన స్పూర్తితో భారత్‌ ఆ ప్రపంచ కప్‌లో వెనక్కి తిరగి చూడలేదు. ఆస్ట్రేలియాతో చివరి లీగ్‌ మ్యాచ్‌ను 118 పరుగులతో గెలిచిన కపిల్‌ డెవిల్స్‌ సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత  నాటి ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది.
చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు

>
మరిన్ని వార్తలు