Kapil Dev- Virat Kohli: మాట మార్చిన కపిల్‌ దేవ్‌?! కోహ్లిని మించిన మొనగాడు లేడు.. అయినా

15 Jul, 2022 15:27 IST|Sakshi

‘‘విరాట్‌ కోహ్లి లాంటి కీలక ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలని నేను అనను. నిజానికి తను గొప్ప క్రికెటర్‌. అలాంటి బ్యాటర్‌కు సముచిత గౌరవం ఇచ్చే క్రమంలో సెలక్టర్లు విశ్రాంతినిచ్చామని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు’’ అని టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నారు. 

దుమారం రేపిన కపిల్‌ వ్యాఖ్యలు
కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించిన ‍కపిల్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తరచుగా విఫలమవుతున్న విరాట్‌ కోహ్లిని టీ20 జట్టుకు ఎందుకు ఎంపిక చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోహ్లి ఫామ్‌పై కపిల్‌ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి.

కొంతమంది కపిల్‌ దేవ్‌ను సమర్థిస్తుండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు సైతం కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ తాజాగా స్పందించారు.

కోహ్లిని మించిన మొనగాడు లేదు.. అయితే!
ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోహ్లి సాదాసీదా క్రికెటర్‌ కాదు. అతడో గొప్ప ఆటగాడు. అలాంటి ప్లేయర్‌ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఏం చేయాలి? అతడికి ప్రాక్టీసు అవసరం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

టీ20 ఫార్మాట్‌లో కోహ్లిని మించిన మొనగాడు ఈ ప్రపంచంలోనే లేడు. అయితే, ఫామ్‌లో లేకుంటే సెలక్టర్లు తమ నిర్ణయం తాము తీసుకోకతప్పదు కదా! నా దృష్టిలో ఓ క్రికెటర్‌ మెరుగ్గా రాణించలేకపోతే రెస్ట్‌ ఇస్తారు.. లేదంటే జట్టు నుంచి తప్పిస్తారు. ఒకవేళ కోహ్లిని తప్పించి రెస్ట్‌ ఇచ్చామని చెప్పి అతడిని గౌరవాన్ని కాపాడారేమో’’ అని కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యానించారు.

రంజీల్లో ఆడాలి..
‘విరాట్‌ లేకుండా ఇండియా గత ఐదారేళ్లలో అసలు మ్యాచ్‌లే ఆడలేదా? ఏదేమైనా అతడు ఫామ్‌లోకి రావాలన్నదే నా ఆశ. తనకు విశ్రాంతినిచ్చినా.. జట్టు నుంచి తప్పించినా.. అతడికి ఇంకా క్రికెట్‌ ఆడగల సత్తా ఉందన్న మాట వాస్తవం.

అయితే, జట్టులోకి వచ్చే మార్గాలను అతడు అన్వేషించాలి. రంజీ ట్రోఫీ లేదంటే ఇతర టోర్నీలు ఆడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. గొప్ప క్రికెటర్‌ అయిన కోహ్లి.. మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి మరీ ఇంత ఎక్కువ సమయం తీసుకోకూడదు. 

తనతో తాను పోరాటం చేయాలి. పునరాలోచన చేయాలి. తనను జట్టు నుంచి తప్పించినా.. విశ్రాంతినిచ్చినా నాకే సమస్య లేదు. అతడు ఫామ్‌లోకి రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఒక్క మ్యాచ్‌ చాలు ఆటగాడి తలరాతను మార్చడానికి! రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. అయినా పెద్దగా తేడా ఏమీ కనబడటం లేదు’’ అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు.

ఇంతకీ మీరేమంటున్నారు కపిల్‌?
కాగా కపిల్‌ ఇంతకు కోహ్లిని సమర్థించాడా లేదంటే.. మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడా అన్న విషయం అర్థంకాక టీమిండియా ఫ్యాన్స్‌ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆఖరికి మీరేమంటారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. కెరీర్‌ను పొడిగించుకునేందుకు యువ బౌలర్ల అవకాశాలు దెబ్బతీసి.. రిటైర్మెంట్‌ ప్రకటించకుండా జిడ్డులా వేలాడిన విషయం మర్చిపోయారా అని సెటైర్లు వేస్తున్నారు. 

చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా..
Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్‌ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే..

మరిన్ని వార్తలు