Kapil Dev: ప్రొటీస్‌నే కాదు టీమిండియాను 'చోకర్స్‌' అని పిలవొచ్చు

11 Nov, 2022 21:32 IST|Sakshi

క్రికెట్‌లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్‌లను చోకర్స్‌ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్‌ అనే ముద్ర క్రికెట్‌లో సౌతాఫ్రికాకు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐసీసీ టోర్నీల్లో ఆరంభంలో వరుస విజయాలు సాధించే ప్రొటీస్‌ కీలకమైన మ్యాచ్‌లు లేదంటే నాకౌట్‌ దశలో చేతులెత్తేయడం చూస్తుంటాం.

వాళ్లు క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేకపోయారు. ఈసారి ప్రపంచకప్‌లో కూడా సౌతాఫ్రికాకు అదే పరిస్థితి ఎదురైంది. గ్రూప్‌-2లో ఉన్న సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌పై గెలిస్తే సెమీస్‌ చేరుకునేది. కానీ దురదృష్టం వారి పక్కనే ఉంటుంది కదా.. అందుకే డచ్‌ చేతిలో ఓడి అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తాజాగా టీమిండియా కూడా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చూసింది. కనీసం పోరాటం కూడా చేయకపోవడం అభిమానులను మరింత బాధపెట్టింది. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఒక ఇంగ్లీష్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014 నుంచి ఐసీసీ ఈవెంట్లలో వరుసగా విఫలమవుతూ వస్తున్న టీమిండియాను ఇకపై చోకర్స్‌ అని పిలవొచ్చని పేర్కొన్నాడు. 

''టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు. ఇటీవలే ఐసీసీ ఈవెంట్లలో చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రమే చోకర్స్‌ అని పిలవొచ్చు. కానీ వ్యక్తిగతంగా జట్టులో కొంత మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ పదం వాడడానికి వీల్లేదు. మరీ అంత కఠినంగా ఉండడం కూడా కరెక్ట్‌ కాదు. ఇండియా చెత్తగా ఆడిందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఒక్క మ్యాచ్‌తో మరీ అంతగా విమర్శించాల్సిన పని లేదు" అని కపిల్‌ స్పష్టం చేశాడు. 

ఇక కపిల్‌ దేవ్‌ సారధ్యంలో టీమిండియా తొలిసారి 1983 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. ఆ తర్వాత ధోని సారధ్యంలో 2007 టి20 ప్రపంచకప్‌,2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఆఖర్లో బోల్తా కొడుతూ వస్తుంది. 2014 టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై ఇండియా బోల్తా పడుతూ వస్తోంది. 2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌, తాజాగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇండియా సెమీస్‌లో  ఓడిపోయింది.

చదవండి: ఫైనల్‌ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్‌ రాజా

మరిన్ని వార్తలు