UAE VS AFG 3rd T20: శివాలెత్తిన ఆఫ్ఘన్‌ ప్లేయర్‌.. 21 బంతుల్లోనే..!

20 Feb, 2023 14:19 IST|Sakshi

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం యూఏఈలో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్‌.. నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో యూఏఈ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను సమం చేసుకుంది.

సిరీస్‌ డిసైడర్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్‌ వసీం (50 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అరవింద్‌ (53 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వసీం, అరవింద్‌ మినహా యూఏఈ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (4-0-16-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. గుల్బదిన్‌ 2, నవీన్‌ ఉల్‌ హక్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇబ్రహీం జద్రాన్‌ (51 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), కరీమ్‌ జనత్‌ (22 బంతుల్లో 56 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కరీం జనత్‌.. కేవలం 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయడమే కాకుండా, సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌, జనత్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్‌ (20), అఫ్సర్‌ జజాయ్‌ (13) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. గుల్బదిన్‌ నైబ్‌ (0), నజీబుల్లా జద్రాన్‌ (1) విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో జహుర్‌ ఖాన్‌కు 2, అకీఫ్‌ రాజా, జవార్‌ ఫరీద్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

మరిన్ని వార్తలు