టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్న ఆర్‌సీబీ ఓపెనర్‌

9 Mar, 2021 16:23 IST|Sakshi

న్యూఢిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో కర్ణాటక ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్‌సీబీ) యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో సీజన్‌లో నాలుగో సెంచరీ బాది.. టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్, కర్ణాటక కెప్టెన్‌ సమర్థ్‌ (22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 192) విధ్వంసం తోడవడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

గతేడాది ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకొన్నాడు. ఆ సీజన్‌లో పడిక్కల్‌ 15 మ్యాచ్‌ల్లో 124 స్ట్రైక్‌ రేట్‌తో 473 పరుగులు సాధించి, ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌‌ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న అనుభవంతో అతను ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో వరుసగా 52, 97, 152, 126*, 145*, 101 స్కోర్లు సాధించి పడిక్కల్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో పడిక్కల్‌ మొత్తం 673 పరుగులు సాధించి.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా తయారవుతన్నాడు.

మరిన్ని వార్తలు