22 ఫోర్లు.. 3 సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు

9 Mar, 2021 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా కేరళతో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గి సెమీస్‌ చేరింది. ఓపెనర్లు సమర్థ్‌ (192; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (101; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. తొలి వికెట్‌కు 249 పరుగులు జోడించారు. కాగా ఓపెనర్‌ సమర్థ్ ఇన్నింగ్స్‌ ఆసాంతం ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు. అయితే తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఇక టోర్నీలో దేవదత్‌కిది  వరుసగా నాలుగో సెంచరీ. కర్ణాటక 50 ఓవర్లలో 3 వికెట్లకు 338 పరుగులు చేసింది. అనంతరం కేరళ 43.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్‌ రోణిత్‌ మోరే 5 వికెట్లతో విజృంభించాడు.

ఆంధ్ర జట్టుకు నిరాశ
ఢిల్లీ: ఇక లీగ్‌ దశలో తమ గ్రూప్‌లో ‘టాప్‌’ ర్యాంక్‌లో నిలిచిన ఆంధ్ర జట్టు నాకౌట్‌ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గుజరాత్‌ జట్టుతో సోమ వారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర జట్టు 117 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత గుజరాత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (134; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్‌ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఆంధ్ర 41.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: 
WTC: ఫైనల్‌ జరిగేది ఎక్కడో తెలుసా?

అదిరిపోయే క్యాచ్‌.. విండీస్‌దే టీ20 సిరీస్‌!

మరిన్ని వార్తలు