ఐపీఎల్‌ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప

19 Sep, 2020 12:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో మాటీవీ చానెల్లో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్‌కు ఎంత డిమాండ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత తెలుగు సీరియళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ఈ సీరియల్‌ మాటీవీలో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. తాజాగా ఇదే సమయంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ మ్యాచ్‌లు కూడా మొదలవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్యే వచ్చి పడింది. (చదవండి : కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి')

ఇంట్లో ఒకే టీవీ ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి.. లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే సమస్యపై సెప్టెంబర్‌ 3న కార్తీకదీపం సీరియల్‌ కోసం ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్‌ టీమ్‌, స్టార్‌ మాకి ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా సీరియస్‌ ఇష్యూ అని.. ఎలాగైనా ఐపీఎల్‌ మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని చెప్పవలసిందిగా స్టార్‌ మాకి కూడా సెపరేట్‌గా ట్వీట్‌ చేశాడు. అప్పట్లో ఈ వార్త సోషల్‌ మీడియాలో కూడా తెగ వైరల్‌గా మారింది. ​దీనిపై స్టార్‌ మా కూడా స్పందిస్తూ శివచరణ్‌ అడిగింది సబబే కదా అంటూ రీట్వీట్ కూడా‌ చేసింది. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు')

అయితే ఈ విన్నపం కార్తీకదీపంలో హీరోయిన్‌ దీప పాత్ర పోషిస్తున్న ప్రీమి విశ్వనాథ్‌కు తెలిసింది. ఒక సీరియల్‌ను ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న దీప(ప్రేమి విశ్వనాథ్‌) వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఉత్తరంతో పాటు 32 అంగుళాల టీవీని కొని శివచరణ్‌ ఇంటికి పంపించింది. ఇప్పుడు శివ చరణ్‌ ఇంట్లో ఏ సమస్య లేదు.. ఇకపై రాదు కూడా.. ఎందుకంటే శివచరణ్‌ కుటుంబసభ్యులు ఒక టీవీలో కార్తీక దీపం చూస్తుంటే , మరొక టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది. ఈ వార్త తెలుసుకున్న మిగతావారు మాకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. (చదవండి : ఐపీఎల్‌ వీరులు వీరే.. ఈసారి ఎవరో?)

మరిన్ని వార్తలు