బంగారంలాంటి బాక్సర్‌.. తజముల్‌

31 Oct, 2021 01:05 IST|Sakshi

అది బుధవారం..టీవీలో కిక్‌బాక్సింగ్‌ వస్తోంది. ‘ఏంటబ్బా! ఇది!’ అని ఆశ్చర్యంగా చూసింది ఎల్‌కేజీ చదువుతోన్న చిన్నారి. కాసేపు చూశాక ‘‘అక్కా! ఏంటిది?’’ అని అడిగింది. ‘‘ఇదా.. కిక్‌బాక్సింగ్‌’’ అంది అక్క. ‘‘అవునా ఇది చాలా బావుంది. నేనుకూడా ఇలా కిక్‌ బాక్సింగ్‌ చేస్తాను’’ అంది. అది విన్న తోబుట్టువులంతా ఏదో చిన్న పిల్ల అంటోందిలే అనుకున్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ మాట చాలా సీరియస్‌గానే అంది.

కిక్‌బాక్సింగ్‌ మీద ఆసక్తి ఏర్పడడంతో ప్రతి బుధ, శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కిక్‌బాక్సింగ్‌ను క్రమం తప్పకుండా చూసేది. అవి చూస్తూ తను కూడా ఎలాగైనా అలా టీవీలో కనిపించేంతగా కిక్‌బాక్సింగ్‌లో రాణించాలనుకుంది. కొన్ని రోజుల గడిచాక ఉండబట్టలేక ‘‘అమ్మా! నేను కిక్‌బాక్సింగ్‌ నేర్చుకుంటాను’’ అని అమ్మను అడిగింది. ఆ చిన్నారి ఆతృత గమనించిన తల్లి ‘‘అసలు నీకు కిక్‌బాక్సింగ్‌ గురించి ఏం తెలుసు? అందులో దెబ్బలు తగులుతాయి’’ అని చెప్పింది.

‘‘లేదు, నేను నొప్పిని ఓర్చుకుని ఎలాగైనా బాక్సింగ్‌ నేర్చుకుంటాను’’ అంది. అమ్మలానే నాన్న కూడా ‘‘వద్దు’’ అన్నారు కానీ,  పట్టువదలని విక్రమార్కుడిలా కిక్‌బాక్సింగ్‌ నేర్చుకునేందుకు అమ్మానాన్నలని ఒప్పించింది తజముల్‌ ఇస్లాం. కశ్మీర్‌కు చెందిన ఈ చిన్నారి అలా పట్టుదలతో కిక్‌బాక్సింగ్‌ నేర్చుకోవడమేగాక, ప్రపంచ కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన తజముల్‌ తాజాగా రెండోసారి ప్రపంచ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–21 అండర్‌ –14 కేటగిరిలో గోల్డ్‌ మెడల్‌ సాధించి భారతీయులు గర్వపడేలా చేయడమేగాక, ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.  

బందిపొర జిల్లాలోని తారకపొర అనే కుగ్రామంలోన ఓ నిరుపేద కుటుంబంలో తజముల్‌ ఇస్లాం జన్మించింది. గులాం మహ్మద్‌ ఐదుగురు సంతానంలో తజముల్‌ నంబర్‌ మూడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తండ్రి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. తన చిన్నారి ఆసక్తిని కాదనలేదు మహ్మద్‌. తజముల్‌ కోరికను నెరవేర్చేందుకు కిక్‌బాక్సింగ్‌లో కోచ్‌ వద్ద శిక్షణ ఇప్పించారు. మొదట్లో సాధన కష్టంగా ఉన్నప్పటికీ, రోజురోజుకీ దృఢంగా తయారై ఉదయం, సాయంత్రం మొత్తం మీద ఐదుగంటలపాటు శ్రమించి, కిక్‌బాక్సింగ్‌ను అవపోసన పట్టింది తజముల్‌. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీ పడి చాంపియన్‌గా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా ఎదిగింది.
 
తొలి గోల్డ్‌మెడల్‌..
2016లో తజముల్‌ ప్రపంచస్థాయి కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఇటలీలో జరిగే ఈ పోటీలకు వెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో కశ్మీర్‌లో స్పాన్సర్‌ చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అదే సమయంలో ఆర్మీస్కూల్లో చదువుతోన్న తజముల్‌ మాష్టారు ఒకరు..విషయం తెలిసి తను ఇటలీ వెళ్లి పాల్గొనడానికి కావాల్సిన ఖర్చును పెట్టుకుంటానని ముందుకొచ్చారు. అంతేగాక ఆర్మీఫెడరేషన్‌ మరికొంత సాయం చేయడంతో అండర్‌–9 చాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణపతకం సాధించింది. అప్పటిదాక సబ్‌జూనియర్‌ స్థాయిలో అంతర్జాతీయ గోల్డ్‌ మెడల్‌ భారత్‌కు ఒక్కటీ లేదు. తొలిగోల్డ్‌ మెడల్‌ సాధించిన భారతీయురాలుగా తజముల్‌ నిలిచింది.

 స్పోర్ట్స్‌ అకాడమీ..
‘‘నువ్వు చిన్నాచితకా మెడల్స్‌ సాధించడం కాదు. ఇటువంటి మెడల్స్‌ను నేను షాపులో కూడా కొనుక్కొస్తాను. నువ్వు గోల్డ్‌ మెడల్‌ తీసురావాలి’’ అంటూ ఆమెలో పట్టుదలను రేకెత్తించాడు తండ్రి. నాన్న మాట నిలబెట్టడంతో తజముల్‌ ఇటలీ నుంచి ఇండియా వచ్చేటప్పటికీ తజముల్‌ పేరుమీద స్పోర్ట్స్‌ అకాడమీకి రిజిస్ట్రేషన్‌ చేసిన పేపర్లను తజముల్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ అకాడమీలో ఐదు నుంచి ఆరు ఏళ్ల వయసు పిల్లలు దాదాపు వందమంది దాక శిక్షణ తీసుకుంటున్నారు. బందిపొరాలో అమ్మాయిలకు క్రీడలపై శిక్షణ ఇచ్చే సంస్థలు పెద్దగా లేవు. తజముల్‌కు గోల్డ్‌ మెడల్‌ వచ్చాక, అమ్మాయిలకు ప్రత్యేక స్పోర్ట్స్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  
 
డాక్టర్‌ అవుతా..

ప్రస్తుతం ఆర్మీ గుడ్‌విల్‌ స్కూల్లో ఏడోతరగతి చదువుతోన్న 13 ఏళ్ల తజముల్‌ భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్‌ సాధించడమే లక్ష్యమంటోంది. ‘‘వార్మప్స్, కిక్స్, పంచ్‌ల సాధన ద్వారా రోజురోజుకి మెరుగవడమే కాదు..  గోల్డ్‌మెడల్స్‌ కూడా సాధించగలిగాను. భవిష్యత్‌లో మంచి ఎముకల సర్జన్‌ని అవుతాను. ఎందుకంటే కిక్‌ బాక్సింగ్‌లో చాలా మంది ఎముకలు విరగ్గొడుతుంటాను కాబట్టి వాళ్లందరికీ శస్త్రచికిత్స చేసి సరిచేస్తాను’’ అని చెబుతోంది తజముల్‌ నవ్వుతూ.
 
తండ్రితో తజముల్‌

మరిన్ని వార్తలు