మ్యాచ్‌కు ముందు తండ్రి చనిపోయినా..

3 Dec, 2020 15:27 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య నిన్న హామిల్టన్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు వెస్టిండీస్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ తండ్రి మృతిచెందారు. ఈ విషయాన్ని విండీస్‌ టీమ్‌ మేనేజర్‌ రావల్‌ లూయిస్‌ మ్యాచ్‌ ఆరం‍భానికి కొన్ని గంటల ముందు ఓ ప్రకటనలో తెలిపారు. రోచ్‌ తండ్రి మృతికి తనతో  పాటు బోర్డు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కీమర్‌ రోచ్‌ త్వరలోనే స్వదేశానికి వెళతారన్నారు. మనం ప్రేమించే దూరమైతే ఆ బాధను జీర్ణించుకోవడం చాలా కష్టమన్నారు. ఈ కష్టసమయంలో రోచ్‌కు తాము అండగా ఉంటామన్నారు.  కాగా, మ్యాచ్‌లో లాథమ్‌ వికెట్‌ను రోచ్‌ సాధించాడు. (చదవండి: ‘ఐపీఎల్‌ వేలంలో అతని కోసం పోటీ తప్పదు’)

వికెట్‌ను తీసిన తర్వాత మోకాళ్లపై  కూర్చొని రోచ్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. తన తండ్రికిచ్చే గౌరవానికి సూచకగా మోకాళ్లపై కాసేపు అలానే కూర్చుండి పోయాడు రోచ్‌. రోచ్‌ తండ్రి మృతికి సంతాపంగా ఇరుజట్ల క్రికెటర్లు చేతికి బ్లాక్‌ బ్యాండ్స్‌ కట్టుకుని బరిలోకి దిగారు.  తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ రెండు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(97 బ్యాటింగ్‌),  రాస్‌ టేలర్‌(31 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.  ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(86) హాఫ్‌ సెంచరీ సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.  విలియమ్సన్‌తో కలిసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. సెంచరీ చేస్తాడనుకున్న తరుణంలో కీమర్‌  రోచ్‌ బౌలింగ్‌లో లాథమ్‌ పెవిలియన్‌ చేరాడు. (చదవండి: 'క్రికెటర్‌ కాకపోయుంటే రైతు అయ్యేవాడు')

>
మరిన్ని వార్తలు