సూపర్‌ ఫుట్‌బాల్‌

20 Nov, 2020 05:08 IST|Sakshi

నేటి నుంచి ఇండియన్‌   లీగ్‌ ఏడో సీజన్‌

కరోనా నేపథ్యంలో మ్యాచ్‌లన్నీ గోవాలోనే

అదృష్టం పరీక్షించుకోనున్న  హైదరాబాద్‌ ఎఫ్‌సీ

తొలి మ్యాచ్‌లో తలపడనున్న కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్‌ బగాన్‌

రాత్రి గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం

కళ్లు చెదిరే ఫ్రీ కిక్‌లు... కళాత్మకమైన పాస్‌లు... మతి పోగొట్టే హెడర్స్‌... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు... వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు  రె‘ఢీ’ అయ్యాయి... మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్‌బాల్‌ పండుగను తీసుకొచ్చాయి.


పనాజీ: నాలుగు నెలల పాటు భారత ఫుట్‌బాల్‌ అభిమానులను అలరించడానికి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) వచ్చేసింది. నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌తో ఏడో సీజన్‌కు తెర లేవనుంది. కరోనా విరామం అనంతరం దేశంలో జరగనున్న తొలి క్రీడా ఈవెంట్‌ ఇదే కావడం విశేషం. దాంతో టోర్నీని ఒకే చోట నిర్వహించడానికి సిద్ధమైన లీగ్‌ నిర్వాహకులు... అందుకోసం గోవాను ఎంచుకున్నారు. అక్కడే ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

క్వారంటైన్‌ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్‌ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్‌లోకి కొత్తగా స్పోర్టింగ్‌ క్లబ్‌ ఈస్ట్‌ బెంగాల్‌ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్‌ ఫేవరెట్లుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్, మాజీ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్‌ (2019–20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.

ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్‌ మార్కజ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్‌ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్‌ తొలి అంచె మ్యాచ్‌ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్‌ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.  

సబ్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరిగింది
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌’ నిబంధన ఐఎస్‌ఎల్‌లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్‌ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను ఆడించవచ్చు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్‌స్టిట్యూట్‌ బెంచ్‌ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు.  

హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు: గోల్‌ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్‌ దూబే, సుబ్రతా పాల్‌.
డిఫెండర్లు: ఆకాశ్‌ మిశ్రా,  ఆశిష్‌ రాయ్, చింగ్లెన్‌సనా సింగ్, డింపిల్‌ భగత్, కిన్‌సైలాంగ్‌ ఖోంగ్సిట్, నిఖిల్‌ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్‌ పన్వార్‌.
మిడ్‌ ఫీల్డర్లు: అభిషేక్‌ హల్దార్, ఆదిల్‌ ఖాన్, సాహిల్‌ తవోరా, హలిచరన్‌ నర్జారీ, హితేశ్‌ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్‌ సస్ట్రే, మార్క్‌ జొతాన్‌పుయా, మొహమ్మద్‌ యాసిర్, నిఖిల్‌ పూజారి, సౌవిక్‌ చక్రవర్తి, స్వీడెన్‌ ఫెర్నాండెస్‌.
ఫార్వర్డ్స్‌: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్‌ డే, జోల్‌ చియానీస్, లాలాంపుయా, లిస్టన్‌ కొలాకో, రోహిత్‌ దను,  
హెడ్‌ కోచ్‌: మాన్యుయెల్‌ మార్కజ్‌.

మరిన్ని వార్తలు