ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డు రేసులో ఉ‍న్న ఆటగాళ్లెవరంటే?

3 May, 2022 20:32 IST|Sakshi

ఏప్రిల్‌ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ముగ్గురు పోటీ పడుతుండగా.. అందులో సౌతాఫ్రికా నుంచి కేశవ్‌ మహారజ్‌, సిమోన్‌ హార్మలు ఉండగా.. ఓమన్‌ నుంచి జతింధర్‌ సింగ్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇక మహిళల విభాగం నుంచి ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలిసా హేలీ, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ నటాలీ సివర్‌, ఉగాండా ఆల్‌రౌండర్‌ జానెట్‌ బబాచిలు ఐసీసీ ఉమెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. రెండు టెస్టులు కలిపి 16 వికెట్లు పడగొట్టాడు.  డర్బన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేశవ్‌ మహారాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు బౌలింగ్‌ వేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు వికెట్లతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను 53 పరుగులకే కుప్పకూల్చడంలో మహరాజ్‌ పాత్ర మరువలేనిది. తన ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫలితంగా సౌతాఫ్రికా 332 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తన ప్రదర్శనతో కేశవ్‌ మహరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను కూడా ఎగురేసుకపోయాడు.

అదే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిమోన్‌ హార్మర్‌ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌లో కీలకమైన 38 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్‌ మహరాజ్‌కు సపోర్ట్‌ ఇచ్చిన సిమోన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరిసిన సిమోన్‌.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. 

ఒమన్‌ ఓపెనర్‌గా జతింధర్‌ సింగ్‌ ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లీగ్‌2లో భాగంగా స్కాట్లాండ్‌, పీఎన్‌జీలతో ఏప్రిల్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో దుమ్మురేపాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 259 పరుగులు చేసిన జతింధర్‌ ఖాతాలో ఒక సెంచరీతో పాటు, మూడు అర్థశతకాలు ఉన్నాయి.

ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్‌ అయిన ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలిసా హేలీ ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆసీసీ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఇక అదే ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన నటాలి సివర్‌ 121 బంతుల్లో 148 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు