ఊహించని ట్విస్ట్‌.. పాపం కెవిన్‌ ఒబ్రెయిన్‌

28 Aug, 2020 11:57 IST|Sakshi

డబ్లిన్‌ : భారీ సిక్సర్లకు కేరాఫ్‌గా ఉండే ఐర్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ ఒబ్రెయిన్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషించాలా లేక కారు అద్దం పగిలినందుకు బాధపడాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అదేంటి మ్యాచ్‌ గెలిపించినందుకు సంతోషించాలి గానీ ఇలా సందిగ్ధంలో ఉండడం ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. ఐర్లాండ్లో జరుగుతున్న ఇంటర్‌ ప్రొవిన్షియల్‌ టీ20 కప్‌ టోర్నీలో గురువారం డబ్లిన్‌ వేదికగా నార్త్‌వెస్ట్‌ వారియర్స్‌, లీన్‌స్టర్‌ లైటనింగ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

అయితే ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన లీన్‌స్టర్‌ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన  కెవిన్‌ ఒబ్రెయిన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు.దీంతో 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్త్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లీన్‌స్టర్‌ జట్టు 24 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్‌లో స్టార్‌ ఆఫ్‌ ది పర్సన్‌గా కెవిన్‌ ఒబ్రెయిన్‌ నిలిచాడు.

ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కెవిన్‌ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్‌ చేసి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ఊహించని ట్విస్ట్‌ ఏంటంటే.. అద్దం పగిలిన కారు కెవిన్‌ ఓబ్రెయిన్‌దే. పాపం అతను కొట్టిన సిక్స్‌ తన కారు అద్దం ధ్వంసం చేస్తుందని అతను కూడా ఊహంచి ఉండడు. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్‌ పార్క్‌ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళ్లి జరిగిందంతా వివరించాడు.

కారును ఇన్సురెన్స్‌ కోటా కింద రిపేయిరింగ్‌కు తరలించారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్నిఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కెవిన్‌ సరదాగా స్పందించాడు.' ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్‌ నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్‌ ఆవల చాలా దూరంలో పార్క్‌ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 'పాపం కెవిన్‌ .. భారీ సిక్సులతో విరుచుకుపడే కెవిన్‌కు ఎంత కష్టం వచ్చింది.. ఆ ఒక్క సిక్స్‌ అతని పాలిట శాపమైంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 (చదవండి : తండ్రి కాబోతున్న కోహ్లి, ఆసీస్‌ టెన్షన్)
(తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి)

మరిన్ని వార్తలు