Kevin Pietersen VS Vaughan: టీమిండియాను ట్రోల్‌ చేసిన వాన్‌.. పీటర్సన్‌ కౌంటర్‌

11 Sep, 2021 09:36 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ మరోసారి టీమిండియాను ట్రోల్‌ చేశాడు. ఐదో టెస్టు రద్దు నేపథ్యంలో వాన్‌ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో టీమిండియా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు నష్టం కలిగించింది. ఒక్క మ్యాచ్‌ రద్దు కావడం వల్ల ఈసీబీ భారీగా నష్టపోతుంది. సరిగ్గా గతేడాది దక్షిణాఫ్రికాతో ఇదే రీతిలో మేం సిరీస్‌ను రద్దు చేసుకున్నాం. మాకు శాపం తగిలినట్టుంది'' అంటూ గుర్తు చేశాడు. అయితే వాన్‌ వ్యాఖ్యలపై మరో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ టీమిండియాకు మద్దతిస్తూ కౌంటర్‌ ఇచ్చాడు. ''ఇది ఊహించని పరిణామం. ఇందులో టీమిండియా తప్పు ఎక్కడుంది. గతంలో కరోనా కారణంగానే ఈసీబీ దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకుంది. మరి దక్షిణాఫ్రికా బోర్డు కూడా చాలా నష్టపోయింది. ప్రతీ విషయాన్ని పాయింట్‌ అవుట్‌ చేయడం కరెక్ట్‌ కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ

ఇక కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు అయిన సంగతి తెలిసిందే. భారత శిబిరంలో కోచ్‌ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్‌ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్‌ రద్దు కావడం వల్ల లాంకషైర్‌ క్రికెట్‌కు, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు.

చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌

>
మరిన్ని వార్తలు