అసలైన సవాలు ఎదురుకాబోతోంది.. జాగ్రత్త: పీటర్‌సన్‌

20 Jan, 2021 15:10 IST|Sakshi

లండన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సాధించిన విజయంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్‌సన్‌ సరదాగా స్పందించాడు. మరీ ఇంత ఘోరంగా ఆసీస్‌ను ఓడించడం ఏమీ బాగాలేదన్న పీటర్‌సన్‌.. ఇంతటి అద్భుత ఘట్టానికి వేదికయ్యే అర్హత బ్రిస్బేన్‌కు లేదంటూ చమత్కరించాడు. క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే మంగళవారం నాటి మ్యాచ్‌లో పంత్‌ అనే కుర్రాడు, పెద్దవాడిగా మారిపోయాడంటూ అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. మొత్తానికి టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందంటూ హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ‘‘ఎన్నో అడ్డంకులు అధిగమించి భారత జట్టు ఈ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రానున్న కొన్ని వారాల్లో మీకు అసలైన సవాలు ఎదురుకాబోతోంది. 

ఇంగ్లండ్‌ జట్టు పర్యటనకు వస్తోంది. మీ సొంతగడ్డపై వారిని ఓడించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి’’ అని పీటర్‌సన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా ఇంగ్లండ్‌ మాజీ సారథి వ్యాఖ్యలకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇదిగో భారత్‌లో సిరీస్‌ ముగిసిన అనంతరం మీ జట్టు పరిస్థితి ఇలాగే ఉంటుంది’’అంటూ ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఇక ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న చెన్నైలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. పెటర్నిటీ లీవ్‌పై ఆసీస్‌ నుంచి భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ సారథ్యంలో జరుగనున్న సిరీస్‌లో భాగంగా ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకున్నారు. (చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌: భారత జట్టు ఇదే!)

>
మరిన్ని వార్తలు