Kevin Pietersen: ప్రధాని మోదీని కలిసిన కెవిన్‌ పీటర్సన్‌

3 Mar, 2023 15:41 IST|Sakshi

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. కాగా పీటర్సన్‌ ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మొదట హోంమంత్రి అమిత్‌ షాతో పీటర్సన్‌ మాటామంతీ చేశాడు. అనంతరం ప్రధాని మోదీని కలిసిన పీటర్సన్‌.. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమన్నాడు. మోదీని కలవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు చెబుతూ పీటర్సన్‌ పోస్టు పెట్టారు.

ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి.  భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.  తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది.

చదవండి: IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్‌ చర్యకు మైండ్‌బ్లాక్‌

మరిన్ని వార్తలు