Khelo India 2022: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో  ఏపీ క్రీడాకారుల సత్తా

14 Jun, 2022 11:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్‌కులలో అండర్‌–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు.

చివరిరోజు సోమవారం బాక్సర్‌ అంజనీకుమార్‌ (63.5–67 కేజీల వెల్టర్‌ వెయిట్‌ విభాగంలో) రజత పతకంతో మెరిశాడు. ఫైనల్‌ పోరులో చండీగఢ్‌ క్రీడాకారుడు అచల్వీర్‌తో పోటీపడి 2–3తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున మొత్తం 161 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యధికంగా వెయిట్‌ లిఫ్టింగ్‌లో 6 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులను పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌  చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్‌.ప్రభాకరరెడ్డి అభినందించారు.

విజేతలు వీరే..
వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగాల్లో ఎస్‌.పల్లవి (స్వర్ణం), సీహెచ్‌.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్‌కే లాల్‌ భషీర్‌ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్‌ (రజతం), ఆర్‌.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్‌ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్‌లో అంజనీకుమార్‌ (రజతం). 

మరిన్ని వార్తలు