తెలంగాణాలో ‘ఖేలో ఇండియా’ కేంద్రం

17 Sep, 2020 04:51 IST|Sakshi

రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు ఆమోదం

న్యూఢిల్లీ: భవిష్యత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్‌ను క్రీడాశాఖ వెచ్చించనుంది.

ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్‌ కండిషనింగ్‌ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. ‘ప్రతీ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం 14 ఒలింపిక్స్‌ క్రీడాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇందులో మూడు క్రీడాంశాలకు ఆయా రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక కేంద్రాలు ఒక నిర్దిష్ట క్రీడలో నైపుణ్యం ఉన్న అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తాయి. 2028 నాటికి పతకాల జాబితాలో టాప్‌–10లో భారత్‌ నిలిచేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.

మరిన్ని వార్తలు