Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన

6 Jun, 2022 05:17 IST|Sakshi

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌  మహిళల జట్టు

పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్‌–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది.

‘బి’ గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్‌ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది.

మరిన్ని వార్తలు