Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి

6 Feb, 2023 05:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్‌ అండర్‌–18 బాలికల టేబుల్‌ వాల్ట్‌ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్‌లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.

అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్‌ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు