World Badminton Championship: 44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...

18 Dec, 2021 05:46 IST|Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు రెండు పతకాలు

44 ఏళ్లలో ఇదే తొలిసారి

సెమీఫైనల్‌ చేరిన శ్రీకాంత్, లక్ష్య సేన్‌

క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్‌

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్‌ ప్రపంచ  చాంపియన్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది.

హుఎల్వా (స్పెయిన్‌): రెండు నెలల క్రితం థామస్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్‌... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్‌ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్‌ ముఖాముఖిగా తలపడతారు.

శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్‌ మార్క్‌ కాల్జూ (నెదర్లాండ్స్‌)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్‌ జావో జున్‌ పెంగ్‌ (చైనా)పై గెలిచాడు. జున్‌ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్‌ 19–20 వద్ద మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌ బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్‌ ప్రణయ్‌ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్‌ ఫైనల్లో కీన్‌ యియు (సింగపూర్‌) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో పోరుకు సిద్ధమయ్యాడు.

సింధుకు నిరాశ...
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్‌ పదుకొనే (1983లో), సాయిప్రణీత్‌ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్‌ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొనే, సాయిప్రణీత్‌ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్‌ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు.

మరిన్ని వార్తలు