కిడాంబి శ్రీకాంత్‌ రిటర్న్స్‌..!

18 Dec, 2021 05:24 IST|Sakshi

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన భారత స్టార్‌ షట్లర్‌

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన

సాక్షి క్రీడా విభాగం: నాలుగేళ్ల క్రితం... కిడాంబి శ్రీకాంత్‌ కొట్టిందే స్మాష్‌... గెలిచిందే టైటిల్‌! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌తో 2017లో అతను ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్‌ ఓపెన్‌... ఈ నాలుగు ఫైనల్‌ మ్యాచ్‌లలో కూడా సంపూర్ణ ఆధిపత్యం... ఏ ప్రత్యర్థి చేతిలోనూ ఒక్క గేమ్‌ కూడా ఓడకుండా శ్రీకాంత్‌ ఈ విజయాలు సాధించాడు.

ఇలాంటి ప్రదర్శన ఫలితంగానే 2018 ఏప్రిల్‌లో వారం రోజుల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కూడా అతను నిలిచాడు. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆట లయ తప్పింది... పేలవ ప్రదర్శనతో అన్‌సీడెడ్‌లు, అనామకుల చేతిలో వరుస పరాజయాలు, మధ్యలో ఇబ్బంది పెట్టిన మోకాలి గాయం, టైటిల్‌ సంగతి తర్వాత, ఆరంభ రౌండ్లు దాటితే చాలనే పరిస్థితి ఒకదశలో కనిపించింది.

గత నాలుగేళ్లలో ఒకే ఒక టోర్నీలో ఫైనల్‌ వరకు వెళ్లగలిగాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అతను అర్హత సాధించలేకపోయాడు. ఒక రకంగా మళ్లీ ‘సున్నా’ నుంచి మొదలు పెట్టాల్సిన స్థితిలో శ్రీకాంత్‌ నిలిచాడు. అయితే అతను వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో సత్తా చాటి మళ్లీ పైకి లేచాడు. ఒక్కో టోర్నీకి తన ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం సాధించి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు.  

నవంబర్‌లో హైలో ఓపెన్‌ (జర్మనీ)లో శ్రీకాంత్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత రెండేళ్లలో అతనికి ఇదే తొలి సూపర్‌–500 సెమీఫైనల్‌. మ్యాచ్‌ గెలిచిన తర్వాత ‘ఎన్నో ఏళ్ల క్రితం నేను తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినప్పుడు కలిగిన భావనే ఇప్పుడూ వచ్చింది. మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్నట్లుంది’ అని వ్యాఖ్యానించడం ఈ ప్రదర్శన విలువేమిటో చెబుతుంది. మోకాలి గాయంతో 2019లో శ్రీకాంత్‌ ప్రదర్శన ఆశించిన రీతిలో సాగలేదు.

అతని బలమైన అటాకింగ్‌ గేమ్‌ కూడా బాగా దెబ్బతింది. ఆ ఏడాది ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచినా, ఓవరాల్‌గా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. దాంతో గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు శ్రీకాంత్‌ సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత మళ్లీ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రపంచాన్ని కరోనా చుట్టేసింది. తాను కోరుకున్నా ఆడలేని పరిస్థితి.

ఇలాంటి సమయంలో రీహాబిలిటేషన్‌పైనే దృష్టి పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ 2020 అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగి క్వార్టర్‌ ఫైనల్‌ చేరగలిగాడు. అయితే మోకాలు మాత్రం  భయపెడుతూనే ఉంది. ‘గాయం నుంచి కోలుకున్నా సరే, ‘స్మాష్‌’కు ప్రయత్నిస్తే మళ్లీ ఏమైనా జరగవచ్చేమో అనే సందేహం శ్రీకాంత్‌ మనసులో ఏదో ఓ మూల వెంటాడుతూనే ఉంది. అందుకే తన శైలికి భిన్నమైన డిఫెన్స్‌ తరహా ఆటకు కూడా అతను ప్రయత్నించాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2021లో ఆడిన తొలి ఆరు టోర్నీలలోనూ ఇది కనిపించింది’ అని భారత జట్టు కోచ్‌లలో ఒకడైన సియాదతుల్లా చెప్పాడు.  

స్పెయిన్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకం ఖరారైనా... ఈ సెప్టెంబర్‌లో మొదలైన యూరోపియన్‌ సర్క్యూట్‌తోనే శ్రీకాంత్‌ ఆట ఒక్కసారిగా మారింది. 2021లో అతని ఆటను రెండుగా విభజించి చూస్తే రెండో దశలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఆరు నెలల విరామం తర్వాత సాగిన ఈ కొత్త ప్రయాణంలో శ్రీకాంత్‌ ఆట కూడా కొత్తగా కనిపించింది. ఇన్నాళ్లూ వేధించిన గాయం సమస్యను అతను అధిగమించి పూర్తి ఫిట్‌గా ఒకప్పటి శ్రీకాంత్‌ను గుర్తుకు తెచ్చాడు. డెన్మార్క్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో వరుసగా రెండుసార్లు వరల్డ్‌ నంబర్‌వన్‌ మొమొటా చేతిలో ఓడినా శ్రీకాంత్‌ ఆట మాత్రం గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా కనిపించింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనైతే రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని, ఆపై వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి మ్యాచ్‌ను మూడో గేమ్‌ వరకు తీసుకెళ్లడంతో అతనిలో ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగింది. హైలో ఓపెన్‌లో లాంగ్‌ ఆంగస్‌పై గెలిచిన తీరు నిజంగా సూపర్‌. ఆపై బాలిలో జరిగిన మూడు టోర్నీల్లో మరింత స్వేచ్ఛగా ఆడాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గ్వాంగ్‌ జుతో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే శ్రీకాంత్‌ దూకుడు కనిపించగా, క్వార్టర్స్‌లో కాల్జూను ఓడించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. శ్రీకాంత్‌ తాజా ప్రదర్శన భవిష్యత్తులో అతను మరిన్ని ప్రతిష్టాత్మక విజయాలు సాధించగలడనే నమ్మకాన్ని కలిగించడం శుభపరిణామం!

మరిన్ని వార్తలు