Kieron Pollard Retirement: పొలార్డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

20 Apr, 2022 22:46 IST|Sakshi

Kieron Pollard Retirement: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్ బుధ‌వారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. పొలార్డ్  త‌న నిర్ణ‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించాడు. వెస్టిండీస్ జ‌ట్టుకు ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా పొలార్డ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కేవ‌లం 34 ఏళ్ల వ‌య‌స్సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. పొలార్డ్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్ త‌రపున ఆడుతున్నాడు.

ఇక ఏప్రిల్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పొలార్డ్ త‌న ఆల్‌రౌండ్ సామర్థ్యంతో విండీస్ జట్టులోతన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎన్నో మ్యాచ్‌ల‌ను ఒంటి చేత్తో జ‌ట్టును  పొలార్డ్ గెలిపించాడు. "నేను ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నాకు నేను ఆలోచించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను.

చాలా మంది యువకుల మాదిరిగానే.. నేను 10 సంవత్సరాల బాలుడుగా ఉన్న‌ప్ప‌టి నుంచి  వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. 15 సంవత్సరాలకు పైగా టీ20,వ‌న్డేల్లో  వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. నేను రిటైర్ అయ్యాక కూడా.. నా జ‌ట్టుకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను. నాకు 15 ఏళ్ల‌పాటు ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు వెస్టిండీస్ క్రికెట్ నా  కృతజ్ఞతలు అని పొలార్డ్ పేర్కొన్నాడు.

కాగా 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ 15 ఏళ్ల కెరీర్‌లో 123 వన్డేలు ఆడాడు. 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2008లో ఆస్ట్రేలియాతో టి20 ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హిట్టర్‌ 101 మ్యాచ్‌ల్లో 1,569 పరుగులు చేశాడు.

గత ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లో పొలార్డ్‌ 6 బంతుల్లో 6 సిక్స్‌ లు బాది... అంతర్జాతీయ క్రికెట్‌లో గిబ్స్, యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో విండీస్‌ గెలిచిన టి20 ప్రపంచకప్‌లో  పొలార్డ్‌ సభ్యుడిగా ఉన్నాడు.  

చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా...

మరిన్ని వార్తలు