రెచ్చిపోయిన పొలార్డ్‌.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు

4 Mar, 2021 09:34 IST|Sakshi

అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా ట్వంటీ ట్వంటీల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. లంక బౌలర్‌ అకిల ధనంజయ బౌలింగ్‌లో పొలార్డ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఇక అంతకు ముందు పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన రికార్డును టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడి చరిత్ర సృష్టించాడు. కాగా మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హెర్షెల్‌ గిబ్స్‌ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌-2007లో భాగంగా ఈ ఘనత సాధించాడు. నెదర్లాండ్స్‌ బౌలర్‌ డాన్‌ వాన్‌ బంగే బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు.

సిరీస్‌లో ముందంజలో వెస్టిండీస్
కాగా 3 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల నిమిత్తం శ్రీలంక ప్రస్తుతం వెస్టిండీస్‌ లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మొదటి టీ20లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టు.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.  సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. పొలార్డ్‌ 38 పరుగుల(11 బంతులు, ఆరు సిక్సర్లు)తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అకిత ధనంజయకు 3, వనిందు హసరంగకు 3 వికెట్లు దక్కాయి.

చదవండినాలుగో టెస్టు లైవ్‌ అప్‌డేట్స్‌: టాస్‌ గెలిచిన ఇంగ్లండ్

మరిన్ని వార్తలు