ఒకే ఓవర్లో 6,6,6,6,6,6

5 Mar, 2021 00:43 IST|Sakshi
కీరన్‌ పొలార్డ్‌, అకిల ధనంజయ

ఒకే ఓవర్లో 6 సిక్సర్లు

బాదిన కీరన్‌ పొలార్డ్‌

ధనంజయ బౌలింగ్‌లో ఊచకోత

తొలి టి20లో లంకపై విండీస్‌ గెలుపు

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనతలో భాగమయ్యాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లోని 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు బాది... గిబ్స్‌ (దక్షిణాఫ్రికా–2007 వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై వాన్‌ డాన్‌ బంజ్‌ బౌలింగ్‌లో), యువరాజ్‌ (భారత్‌– 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో) తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పొలార్డ్‌ దెబ్బకు 36 పరుగులు సమర్పించుకున్న బాధిత బౌలర్‌ గా స్పిన్నర్‌ అకిల ధనంజయ నిలిచాడు.  

పొలార్డ్‌ సిక్సర్లు కొట్టాడిలా...
తొలి బంతి (లెంగ్త్‌ బాల్‌): మోకాలిపై కూర్చొ ని స్లాగ్‌ షాట్‌. లాంగాన్‌ మీదుగా సిక్సర్‌.
రెండో బంతి (ఫుల్‌ బాల్‌): నేరుగా సైట్‌ స్క్రీన్‌ వైపు సిక్సర్‌.
మూడో బంతి (వికెట్‌కు కొంత దూరంగా ఫుల్లర్‌ బాల్‌): వైడ్‌ లాంగాఫ్‌ దిశగా సిక్సర్‌.
నాలుగో బంతి (లెంగ్త్‌ బాల్‌): స్లాగ్‌ షాట్‌. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌.
ఐదో బంతి (ఆఫ్‌ స్టంప్‌పై లెంగ్త్‌ బాల్‌): బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌.
ఆరో బంతి (రౌండ్‌ ద వికెట్‌ ప్యాడ్‌లపైకి): అలవోకగా డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌.

‘హ్యాట్రిక్‌’ తర్వాత...
పొలార్డ్‌ బాదుడుకు ముందు వేసిన ఓవర్‌లో ధనంజయ ఒక్కసారిగా హీరోలా కనిపించగా, తర్వాతి ఓవర్‌కే పరిస్థితి తలకిందులైంది. మ్యాచ్‌లో ముందుగా లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. చూస్తే చిన్న లక్ష్యంగానే కనిపించింది కానీ ధనంజయ వరుస బంతుల్లో లూయిస్‌ (28), గేల్‌ (0), పూరన్‌ (0)లను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయడంతో మ్యాచ్‌ లంక వైపు తిరిగింది. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన 13వ బౌలర్‌గా అకిల నిలిచాడు. అయితే చివరకు 13.1 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసిన విండీస్‌ 4 వికెట్లతో మ్యాచ్‌ గెలిచింది. 

మరిన్ని వార్తలు