రాహుల్‌ పంజా

25 Sep, 2020 02:49 IST|Sakshi

సెంచరీతో చెలరేగిన పంజాబ్‌ కెప్టెన్‌

97 పరుగులతో బెంగళూరు చిత్తు

పంజాబ్‌ కెప్టెన్, డాషింగ్‌ ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ మైండ్‌బ్లాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ అత్యధిక స్కోరును ఆవిష్కరించాడు. అతని జోరుకు సిక్స్‌లు, ఫోర్లు బౌండరీ లైను తాకేందుకు పదేపదే పోటీపడ్డాయి. అతని దెబ్బకు బెంగళూరు బౌలింగ్‌ విలవిల్లాడింది. తర్వాత కొండంత లక్ష్యఛేదనలో గోరంత స్కోరుకే ఆర్‌సీబీ టాప్‌ లేచింది. చివరకు కనీసం రాహుల్‌ స్కోరుకు చేరువగా కూడా రాలేక చేతులెత్తేసింది.   

దుబాయ్‌: తొలి మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో ఓడిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సత్తా చాటింది. గురువారం జరిగిన పోరులో పంజాబ్‌ 97 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లోకేశ్‌ రాహుల్‌ (69 బంతుల్లో 132 నాటౌట్‌; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.  

ప్రవాహంలా సాగి... 
ఇన్నింగ్స్‌లో సగానికి పైగా బంతులు (69) ఎదుర్కొన్న రాహుల్‌ చివరి వరకు నిలబడి పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్‌లో ఫైన్‌ లెగ్‌లో మొదలైన బౌండరీల ప్రవాహం అదే రీతిలో కొనసాగింది.  ఉమేశ్‌ వేసిన పదో ఓవర్లో  రాహుల్‌ డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో సిక్స్, ఫైన్‌లెగ్‌లో ఫోర్‌ కొట్టాడు. 12వ ఓవర్లో అతని అర్ధసెంచరీ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తికాగా, జట్టు 100 పరుగులకు చేరింది. ఇక సిక్సర్లయితే అన్ని ‘తార’తీరం చేరినవే!  పవర్‌ ప్లేలో కింగ్స్‌ ఎలెవన్‌ సరిగ్గా 50 పరుగులు చేసింది. ఓవర్‌కు సగటున 8 పరుగుల రన్‌రేట్‌తో పంజాబ్‌ దూసుకెళ్లింది. పేసర్లను పక్కనబెట్టిన బెంగళూరు సారథి కోహ్లి బంతిని స్పిన్నర్‌ చహల్‌కు అప్పగించగా... చహల్‌ గూగ్లీకి మయాంక్‌ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) క్లీన్‌బౌల్డయ్యాడు. 57 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది.

శివమ్‌ దూబే వరుస ఓవర్లలో పూరన్‌ (17), మ్యాక్స్‌వెల్‌ (5)ను అవుట్‌ చేసినా...ఏ ఒక్కరు రాహుల్‌ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. వెటరన్‌ పేసర్‌ స్టెయిన్, సీనియర్‌ పేసర్‌లను లెక్క చేయకుండా రాహుల్‌  విధ్వంసం అజేయంగా సాగింది.  62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రాహుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కవర్, డీప్‌ మిడ్‌ వికెట్, లాంగాన్, లాంగాఫ్‌ ఇలా మైదానమంతా అతను విరుచుకుపడ్డాడు. స్టెయిన్‌ 19వ ఓవర్‌లో 6, 4, 0, 6, 6, 4లతో ఐదుసార్లు బంతిని ఫీల్డర్లకు అందకుండా బాదేసి 26 పరుగులు పిండుకున్నాడు. దూబే వేసిన ఆఖరి ఓవర్లోనూ రాహుల్‌ వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు (4, 6, 6) కొట్టాడు. దీంతో ఆఖరి 9 బంతుల్లోనే అతని విధ్వంసం 42 పరుగుల్ని తెచ్చిపెట్టాయి.

16 బంతులకే... 
భారీ లక్ష్యం ముందుంటే బెంగళూరు బాధ్యతే మరిచింది. మొదటి 16 బంతులకే పరాజయానికి బాటలు వేసుకుంది. తొలి ఓవర్లో పడిక్కల్‌ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్‌ (0), మూడో ఓవర్లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్‌ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్‌ వికెట్లను కోల్పోవడంతో ఆర్‌సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్‌ అద్భుతమైన డెలివరీకి ఫించ్‌ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్‌ కాగా, ఆపై డివిలియర్స్‌ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వల్లా కాలేదు. ఆ తర్వాత సుందర్‌ మినహా... అంతా విఫలం కావడంతో బౌలర్లకు 20 ఓవర్లు వేసే శ్రమ తప్పింది. అవతలివైపు రాహు ల్‌ ఒక్కడే 14 ఫోర్లు కొడితే ఇక్కడ మాత్రం అంతాకలిసి కొట్టిన ఫోర్లు (10), సిక్స్‌లు (3) కూడా ఆ సంఖ్యను చేరలేకపోయాయి.

1 ఐపీఎల్‌లో భారత ఆటగాడు నమోదు 
చేసిన అత్యధిక స్కోరు (132 నాటౌట్‌) ఇదే. గతంలో రిషభ్‌ పంత్‌ (128 నాటౌట్‌) పేరిట ఈ ఘనత ఉంది. లీగ్‌లో కెప్టెన్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రాహుల్‌ నిలిచాడు. ఇంతకు ముందు వార్నర్‌ 126 పరుగులు చేశాడు. 

కోహ్లి మిస్సింగ్స్‌
మైదానంలో  పాదరసంలా కదిలే ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి మిస్‌ ఫీల్డింగ్‌ విస్మయపరిచింది. ఈ చురుకైన ఫీల్డర్‌ ... వరుస ఓవర్లలో రాహుల్‌ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో 83 పరుగుల వద్ద రాహుల్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో కొట్టిన షాట్‌ను ఓ సారి, సైని బౌలింగ్‌లో 89 పరుగుల వద్ద లాంగాఫ్‌లో మరోసారి క్యాచ్‌ల్ని చేజార్చాడు.

స్కోరు వివరాలు 
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (నాటౌట్‌) 132; మయాంక్‌ (బి) చహల్‌ 26; పూరన్‌ (సి) డివిలియర్స్‌ (బి) దూబే 17; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫించ్‌ (బి) దూబే 5; కరుణ్‌ నాయర్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 206.
వికెట్ల పతనం: 1–57, 2–114, 3–128.
బౌలింగ్‌: ఉమేశ్‌ 3–0–35–0, స్టెయిన్‌ 4–0–57–0, సైనీ 4–0–37–0, చహల్‌ 4–0–25–1, సుందర్‌ 2–0–13–0, దూబే 3–0–33–2.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ (సి) రవి (బి) కాట్రెల్‌ 1; ఫించ్‌ (బి) రవి 20; ఫిలిప్‌ (ఎల్బీ) (బి) షమీ 0; కోహ్లి (సి) రవి (బి) కాట్రెల్‌ 1; డివిలియర్స్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 28; సుందర్‌ (సి) మయాంక్‌ (బి) రవి 30; దూబే (బి) మ్యాక్స్‌వెల్‌ 12; ఉమేశ్‌ (బి) రవి 0; సైనీ (బి) మురుగన్‌ అశ్విన్‌ 6; స్టెయిన్‌ (నాటౌట్‌) 1; చహల్‌ (ఎల్బీ) (బి) మురుగన్‌ అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్‌) 109.
వికెట్ల పతనం: 1–2, 2–3, 3–4, 4–53, 5–57, 6–83, 7–88, 8–101, 9–106, 10–109.
బౌలింగ్‌: కాట్రెల్‌ 3–0–17–2, షమీ 3–0–14–1, బిష్ణోయ్‌ 4–0–32–3, మురుగన్‌ అశ్విన్‌ 3–0–21–3, నీషమ్‌ 2–0–13–0, మ్యాక్స్‌వెల్‌ 2–0–10–1.  

మరిన్ని వార్తలు