కింగ్స్‌ పంజాబ్‌ జైత్రయాత్ర

26 Oct, 2020 22:56 IST|Sakshi

షార్జా:  వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని రేసులోకి వచ్చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా ముందుగా బ్యాటింగ్‌ చేసి 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4ఫోర్లు), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), గేల్‌((51; 28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు ఆకట్టుకున్నారు.  కింగ్స్‌ 47 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన 8వ ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత మన్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌లు మరో వికెట్‌ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. క్రిస్‌ గేల్‌ 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఇది ఆరో ఓటమి.ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ నాల్గో స్థానానికి చేరింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రాణా డకౌట్‌ అయ్యాడు. మొదటి ఓవర్‌ రెండో బంతికే రాణా పెవిలియన్‌ చేరాడు.  ఆ తర్వాత ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి(7), దినేశ్‌ కార్తీక్‌(0)లు ఔటయ్యారు. మహ్మద్‌ షమీ వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్‌ కాగా, ఆఖరి బంతికి కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో కేకేఆర్‌ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్‌ తేరుకుంది. మోర్గాన్‌ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్‌(6),నాగర్‌కోటి(6), కమిన్స్‌(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. ఇక గిల్‌ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో  57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్‌(24 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్‌,  క్రిస్‌ జోర్డాన్‌ చెరో  రెండు వికెట్లు తీశారు. మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు