ఒకే మ్యాచ్‌.. రెండు సూపర్‌ ఓవర్లు

19 Oct, 2020 00:17 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు పడ్డాయి. ఇందుకు ముంబై ఇండియన్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ వేదికైంది.  ముందు జరిగిన సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలి సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్‌ ఆడించారు. ఆ సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్‌ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్‌ ఛేదించింది.  మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్‌  వేసిన తొలి బంతిని గేల్‌ సిక్స్‌ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్‌ ఫోర్‌ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది.

అంతకముందు ప్రధాన మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క‍్రమంలో కింగ్స్‌ పంజాబ్‌ కూడా సరిగ్గా అన్ని పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయానికి 9 పరుగులు అవసరం కాగా,  8 పరుగులే చేశారు. బౌల్ట్‌ వేసిన ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.  కేఎల్‌ రాహుల్‌(77;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి రాణించాడు,. కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో టాపార్డర్‌ ఆటగాళ్లు విఫలమైనా రాహుల్‌ మాత్రం మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.  లక్ష్య ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ ఆదిలోనే మయాంక్‌ అగర్వాల్‌(11) వికెట్‌ను  కోల్పోయింది. క్రిస్‌ గేల్‌(24; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా, నికోలస్‌ పూరన్‌(24; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లు) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కింగ్స్‌  విజయానికి 24 పరుగులు కావాల్సిన తరుణంలో రాహుల్‌ ఔటయ్యాడు. బుమ్రా వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌ రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, దీపక్‌  హుడా, జోర్డాన్‌లు 21 పరుగులే చేశారు. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే రోహిత్‌ శర్మ(9), సూర్యకుమార్‌ యాదవ్‌(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ ఔట్‌ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి సూర్యకుమార్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక ఇషాన్‌ కిషన్‌(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్‌ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్‌(34 నాటౌట్‌; 12 బంతుల్లో 1 ఫోర్‌,  4 సిక్స్‌లు), కౌల్టర్‌ నైల్‌(24 నాటౌట్‌; 12 బంతుల్లో  4 ఫోర్లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ముం‍బై గౌరవప్రదమైన స్కోరు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్‌ జోర్డాన్‌, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు