పూరన్‌... ఏం మాయ చేశాడే 

28 Sep, 2020 16:25 IST|Sakshi

షార్జా:  ఐపీఎల్‌ టి20 టోర్నీలో రాజస్తాన్‌ రాయల్స్‌ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ సామ్సన్‌ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్‌ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 

ఇదిలా ఉంచితే, పూరన్‌ కళ్లు చెదిరే విన్యాసంతో ఔరా అనిపించాడు. మురుగన్‌ అశ్విన్‌ 8వ ఓవర్‌ మూడో బంతిని సామ్సన్‌ పుల్‌ చేశాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌లో అది సిక్సర్‌ అనుకున్నారంతా! కానీ పూరన్‌ బౌండరీలైన్‌ వెలుపల సెకనుతో పోటీపడి మరీ బంతి క్యాచ్‌ పట్టాడు. ఎడంచేత్తో మైదానంలోకి విసిరాడు. ఇదంతా క్షణకాలంలోనే జరగడం, రీప్లేలో అతని విన్యాసం స్పష్టమవడంతో అంతా వావ్‌ అన్నారు. టీవీ వ్యాఖ్యాతలు, సచిన్‌ టెండూల్కర్‌లాంటి క్రికెట్‌ దిగ్గజాలు సైతం పూరన్‌ మెరుపు విన్యాసాన్ని పొగడ్తలు, ట్వీట్లతో ముంచెత్తారు. దీనికి అంతే మెరుపు వేగంతో వేలసంఖ్యలో లైక్‌లు కొట్టారు. రీట్వీట్‌ చేశారు. (చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు )

రోడ్స్‌పై సచిన్‌ ప్రశంసలు..
పూరన్‌ క్యాచ్‌పై సచిన్‌ టెండూల‍్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతటి మెరుపు ఫీల్డింగ్‌ తాను ఇంతకముందు ఎ‍న్నడూ చూడలేదంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలోనే కింగ్స్‌ పంజాబ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ను కొనియాడాడు. ‘జాంటీ ఇప్పుడు తాను బౌండరీ లైన్‌పై ఫోర్లు సేవ్‌ చేయడంపై మాట్లాడుతున్నా.  నీ ఏరియా సాధారణంగా 30 యార్డ్‌లు సర్కిల్‌. నువ్వు ఎప్పుడూ అత్యుత్తమమే’ అని సచిన్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు.

మరిన్ని వార్తలు