‘నీ పని చూసుకో’...

6 Mar, 2021 05:49 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ కోచ్‌ మథియాస్‌కు కేంద్ర క్రీడల మంత్రి మందలింపు

న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ కోచ్‌ మథియాస్‌ బో (డెన్మార్క్‌)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్‌ బో ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్‌ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.

అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్‌ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్‌ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్‌ బో 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్‌ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్‌ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు