Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్‌ దశ మారనుందా!

17 Aug, 2022 18:22 IST|Sakshi

రెండుసార్లు ఐపీఎల్‌ విజేత అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) తమ కొత్త కోచ్‌గా దిగ్గజ రంజీ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్‌రైడర్స్‌ యాజమాన్యం బుధవారం ట్విటర్‌ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్‌ రెగ్యులర్‌ కోచ్‌గా ఉన్న బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌.. ఈ ఏడాది ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్‌ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్‌.

ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్‌ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్‌లో అత్యంత సూపర్‌ సక్సెస్‌ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ సరైనవాడని కేకేఆర్‌ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్‌ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్‌ కోచ్‌గా తీసుకొచ్చింది.

ఇదే విషయమై కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్‌ చంద్రకాంత్‌ కేకేఆర్‌ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్‌ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు.  అందుకే దేశవాలి క్రికెట్‌లో దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. మా కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్‌ టైటిల్‌ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు.

ఇక చంద్రకాంత్‌ పండిట్‌ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌ తరపున చంద్రకాంత్‌ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్‌ కాలేకపోయిన చంద్రకాంత్‌ పండిట్‌ రంజీ కోచ్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. చంద్రకాంత్‌ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. 

ఇక గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌.. మరోసారి కప్‌ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్‌ మోర్గాన్‌ సారధ్యంలో ఫైనల్‌ చేరినప్పటికి.. సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కేకేఆర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్‌ చేరడంలో విఫలమైన కేకేఆర్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు

>
మరిన్ని వార్తలు