నరైన్‌ బౌలింగ్‌పై కేకేఆర్‌ అధికారిక ప్రకటన

12 Oct, 2020 17:49 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తన బౌలింగ్‌ యాక్షన్‌తో వెస్టిండీస్‌ స్పిన్నర్‌, కేకేఆర్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై సందేహాలు వచ్చాయి.  దీనిపై మ్యాచ్‌ తర్వాత అంపైర్లు.. నరైన్‌ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నరైన్‌ బౌలింగ్‌ చేయవచ్చని, ఒకవేళ ఫిర్యాదు వస్తే మాత్రం సస్పెన్షన్‌ ఖాయమని అధికారులు తెలిపారు. దీనిపై కేకేఆర్‌ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ ప్రస్తుత ఐపీఎల్‌లో నరైన్‌ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడాడు. మరి అప్పుడు ఏ ఒక్క అధికారి నరైన్‌ బౌలింగ్‌పై అనుమానం వ్యక్తం చేయలేదు. ఇది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలోనే దీనిపై ఒక ప్రతిపాదన వస్తుంది. ఈ విషయంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వేగవంతమైన చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాము’ అని కేకేఆర్‌ తెలిపింది. ఈరోజు(సోమవారం) ఆర్సీబీతో కేకేఆర్‌ తలపడనుంది. కానీ ఈ మ్యాచ్‌లో నరైన్‌ ఆడతాడా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. (పంత్‌ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్‌)

2012 నుంచి ఇప్పటివరకూ సునీల్‌ నరైన్‌ 115 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. అయితే నరైన్‌ బౌలింగ్‌పై 2015 చివరిసారి ఫిర్యాదు అందిన తర్వాత బౌలింగ్‌ యాక్షన్‌ సరిచేసుకుని మళ్లీ క్రికెట్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ 68 ఐపీఎల్‌ గేమ్‌లను నరైన్‌ ఆడాడు.  2014లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్‌ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో అతడిని సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ సరిగా లేదని తేలితే మాత్రం అతనిపై మరొకసారి వేటు తప్పదు. (ఇది చెన్నై సూపర్‌ కింగ్స్‌ కాదు!)

మరిన్ని వార్తలు